ఏపీలో మూడు కొత్త విమానాశ్రయాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాం : పురందేశ్వరి

ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త విమానాశ్రయాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నామని ఎంపీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు

By Medi Samrat  Published on  17 July 2024 9:41 AM
ఏపీలో మూడు కొత్త విమానాశ్రయాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాం : పురందేశ్వరి

ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త విమానాశ్రయాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నామని ఎంపీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. “కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే అధికారంలో ఉండడంతో కుప్పం, దగదర్తి, మూలాపేటలో కొత్త విమానాశ్రయాలను ప్లాన్ చేయగలుగుతున్నాం” అని ఆమె ‘X’లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆమె అన్నారు. ఈ అభివృద్ధి కనెక్టివిటీని పెంపొందించడమే కాకుండా ఆర్థిక పురోగతిని కూడా ప్రోత్సహిస్తుందని ఆమె చెప్పారు.

చంద్రబాబు ప్ర‌తినిధ్యం వ‌హిస్తున్న కుప్పంలో ఒక విమానాశ్ర‌యం. మరో రెండు నెల్లూరు జిల్లాలోని దగదర్తి, శ్రీకాకుళం జిల్లా మూలపేటలో ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పనులు కూడా వేగం పుంజుకున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కె. రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో భోగాపురం పనులు ఊపందుకున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గత వారం భోగాపురంలో పర్యటించి జూన్ 2026 నాటికి విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని జీఎంఆర్‌ని ఆదేశించారు. డిసెంబర్ 2026 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని డెవలపర్ హామీ ఇచ్చారు.

Next Story