అమరావతి రాజధాని రైతులతో టీడీపీ అధినేత చంద్రబాబు వెయ్యి రోజులుగా కృత్రిమ ఉద్యమం నడిపిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు . ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజే వాడీవేడిగా జరిగాయి. పలు అంశాలపై చర్చించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎట్టకేలకు పరిపాలన వికేంద్రీకరణపై మాట్లాడారు. కట్టని రాజధాని, కట్టని గ్రాఫిక్స్ అంటూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమాలు చేస్తున్నారని ప్రశ్నించారు.
అమరావతి రైతులతో మరోసారి మహాపాదయాత్ర నిర్వహించడం ద్వారా మిగిలిన ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ సొంత అభివృద్ధి కోసమే అమరావతి ఉద్యమం అన్నారు. తన బినామీ భూములున్న ప్రాంతమే రాజధాని కావాలని టీడీపీ నేతలు అత్యాశతో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. అమరావతి ప్రాంత ప్రజలపై తనకు ఎలాంటి ద్వేషం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మాయమాటలతో మోసం చేస్తున్న చంద్రబాబుపై ఐపీసీ 420 కింద కేసు నమోదు చేయాలని సీఎం జగన్ అన్నారు.
వైఎస్ జగన్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయలేకపోయిందని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం అనేక కుంభకోణాలు చేసి నిధులను దోచుకుందని ఆరోపించారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కన్నా కట్టని, కట్టలేని అమరావతి చంద్రబాబుకు గొప్పదని అన్నారు. దోచుకో, పంచుకో, తినుకో అనే డీపీటీ పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. రాజధానిలో తన అనుచరులతో చంద్రబాబు భూములు కొనుగోలు చేశారని సీఎం జగన్ ఆరోపించారు.