కాకినాడ జిల్లా గొల్లప్రోలులో వైఎస్సార్ కాపు నేస్తం నగదు పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమ చేశారు. కాపు నేస్తం కింద అర్హులైన 3,38,792 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ. 508.18 కోట్లను బటన్ నొక్కి జమ చేశారు. కాపు సామాజిక వర్గంలోని 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తోంది. వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం.. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద అక్కచెల్లెమ్మల ఆర్ధికాభివృద్ది, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం నగదును జమ చేసింది.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ''వైఎస్సార్ కాపు నేస్త పథకం వరుసగా మూడో ఏడాది అమలు చేస్తున్నాం. మూడేళ్లలో ఇప్పటివరకూ ఒక్కొక్కరికీ రూ. 45 వేలు ఇచ్చాం. ఇప్పటివరకూ వైఎస్సార్ కాపు నేస్తం కింద రూ.1,492 కోట్లు సాయం అందించాం. నవరత్నాల ద్వారా మూడేళ్లలో కాపు సామాజిక వర్గానికి 16,256 కోట్ల లబ్ధి జరిగింది. నాన్ డీబీటీ ద్వారా కాపు సామాజిక వర్గానికి మరో 16 వేల కోట్ల లబ్ధి జరిగింది. మొత్తంగా కాపు సామాజిక వర్గానికి మూడేళ్లలో 32,296 కోట్ల లబ్ధి జరిగింది'' అని సీఎం జగన్ తెలిపారు.
తమ ప్రభుత్వంలో డీబీటీ ద్వారా నేరుగా బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని వెల్లడించారు. ''చంద్రబాబు హయాంలో డీపీటీ (దోచుకో, పంచుకో, తినేకో) కావాలా? లేదా మా ప్రభుత్వం ఇస్తున్న డీబీటీ కావాలా?. ఎవరి పాలన కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. చంద్రబాబు పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. పేదలకు సంక్షేమ పథకాలు చేరవేయాలన్న ఆలోచన కూడా చంద్రబాబుకు లేదు'' అని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబు తన ఐదేళ్ల పానలో కాపులను నిలువునా మోసం చేశారని జగన్ ఆరోపించారు.