ఎరక్కపోయి వచ్చాడు ఇరుక్కున్నాడు
Thief gets stuck in a temple window while trying to escape in Srikakulam.64 కళల్లో చోర కళ కూడా ఒకటి. దొంగతనం
By తోట వంశీ కుమార్ Published on 6 April 2022 8:54 AM GMT64 కళల్లో చోర కళ కూడా ఒకటి. దొంగతనం చేయాలంటే తెలివి, నైపుణ్యం, చాకచక్యం అన్నీ ఉండాలి. అంతేనా.. అదృష్టం కూడా తోడు కావాల్సిందే. ఓ దొంగ ఆలయంలోని అమ్మవారి నగలపై కన్నేశాడు. పక్కా ప్లాన్ ప్రకారం వాటిని చోరీ చేశాడు. అయితే.. ఆలయంలోంచి బయటకు రాలేక ఇరుక్కుపోయాడు. చివరికి గ్రామస్తులకు చిక్కాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కంచిలి మండలం జాడుపుడి గ్రామంలో జామీ ఎల్లమ్మ దేవాలయం ఉంది. అయితే.. ఆ ఆలయం ఊరికి చివరగా ఉంటుంది. కంచిలికి చెందిన ఇసురు పాపారావు అనే వ్యక్తి ఆలయంలో చోరీకి యత్నించాడు. మంగళవారం తెల్లవారుజామున గుడి కిటీకీ పగల గొట్టి గుడిలోకి ప్రవేశించాడు. హుండీలోని కానుకలు, అమ్మవారి ఆభరణాలను దొంగిలించాడు. మళ్లీ ఎలాగైతే ఆలయంలోకి ప్రవేశించాడో అలాగే బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు.
అయితే.. అతడి దురదృష్టమో.. అమ్మవారి మహత్యమో తెలీదు కానీ బయటకు రాలేకపోయాడు. ఆ కన్నంలో ఇరుక్కుపోయాడు. ముందుకు వెళ్లలేక, వెనక్కి దిగలేక ఇరుక్కుపోయి నరకయాతన అనభవించాడు. ఈలోగా తెల్లవారింది. గ్రామస్తులు అతడిని చూసేశారు. తనను బయటకు తీయాలని గ్రామస్తులను అతడు వేడుకున్నాడు. అతడి చేతిలో ఉన్న అమ్మవారి నగలు కింద పడి ఉండడం గమనించిన గ్రామస్తులు.. పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అతడిని బయటకు తీసి దేహశుద్ది చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.