తెలుగువాళ్లు ఎవరెవరికి పద్మ అవార్డులు వచ్చాయంటే

కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. వీటిని 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న ప్రకటించారు. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్‌, 19 మందికి పద్మ భూషణ్‌, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది.

By అంజి  Published on  26 Jan 2025 6:45 AM IST
celebrities, Telugu states, Padma awards

తెలుగువాళ్లు ఎవరెవరికి పద్మ అవార్డులు వచ్చాయంటే

కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. వీటిని 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న ప్రకటించారు. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్‌, 19 మందికి పద్మ భూషణ్‌, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఏపీ నుంచి ఐదుగురు, తెలంగాణ నుంచి ఇద్దరికి పద్మ అవార్డులు వరించాయి.

కళల విభాగంలో నందమూరి బాలకృష్ణకు (ఏపీ) పద్మభూషణ్

నటుడు ఎన్టీఆర్‌ వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ సినీ రంగంలో తనదైన మార్కును సృష్టించుకున్నారు. 14 ఏళ్ల వయసులో 'తాతామ్మ కల' (1974)తో సినిమాల్లోకి అడుగుపెట్టారు. మంగమ్మగారి మనవడ, ముద్దుల మావయ్య, లారీ డ్రైవర్‌, ఆదిత్య 369, భైరవద్వీపం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్‌, అఖండ వంటి అనేక సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించారు. ఇప్పటి వరకు 109 సినిమాలు పూర్తి చేశారు. అటు హిందూపురం ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎన్నికయ్యారు. బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్‌గా పేద క్యాన్సర్‌ రోగులకు సేవలు అందిస్తున్నారు.

ఏపీకి చెందిన మిరియాల అప్పారావుకు పద్మశ్రీ (కళలు)

బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావు ఈ నెలలోనే కనుమ పండుగ రోజు మరణించారు. ఆయన కోనసీమ జిల్లా రావులపాలెంలో నివాసం ఉండేవారు. శనివారం నాడే దశదిన కర్మ నిర్వహించారు. ఇదే సమయంలో పద్మశ్రీకి అప్పారావు ఎంపికయ్యారంటూ సమాచారం రావడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కరప మండలం నడకుదురు గ్రామంలో 1949లో అప్పారావు జన్మించారు. 1969లో బుర్రకథ రంగంలో అడుగుపెట్టి జూనియర్‌ నాజర్‌, రావిశెట్టి వీరేశం గురువుల వద్ద బుర్రకథ కళను అభ్యసించారు. అప్పరావు.. రాగాల అప్పారావుగా కూడా పేరొందారు. రేడియోలో, దూరదర్శన్‌లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు.

ఏపీకి చెందిన కె.ఎల్‌.కృష్ణకు పద్మశ్రీ (సాహిత్యం)

ప్రొఫెసర్‌ కొసరాజు లీలా కృష్ణ ప్రముఖ ఆర్థికవేత్త. కృష్ణ ఆర్థిక పరిశోధన, విద్యకు చేసిన గణనీయమైన కృషిని.. కేంద్రం పద్మ పురస్కారంతో గౌరవించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో విశేష సేవలు అందించారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఉంగటూరులో జన్మించారు.

ఏపీకి చెందిన మాడుగుల నాగఫణిశర్మకు పద్మశ్రీ (కళలు)

సహస్ర అవధాని మాడుగుల నాగఫణి శర్మకు సాహిత్యం, విద్య విభాగంలో తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డు వరించింది. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లు గ్రామానికి చెందిన మాడుగుల నాగఫణి శర్మ కేవలం పదో తరగతి చదివారు. ఆ తర్వాత ఆధ్యాత్మికత దిశగా వెళ్లి అవధానిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయన తల్లిదండ్రులు మాడుగుల నాగభూషణ శర్మ, సుశీలమ్మ. 1959లో నాగఫణి శర్మ జన్మించారు.

ఏపీకి చెందిన పంచముఖి రాఘవేంద్రచార్యకు పద్మశ్రీ (సాహిత్యం)

ఏపీకి చెందిన వాధిరాజు రాఘవేంద్రచార్య పంచముఖికి పద్మ శ్రీ వరించింది. ఈయన సుదీర్ఘకాలం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ డెవల్‌పమెంట్‌ సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం మంత్రాలయ సంస్కృత విద్యాలయ విశ్వవిద్యాలయం ఛాన్స్‌లర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో పదేళ్లుగా ఛాన్స్‌లర్‌గా పని చేశారు. వాధిరాజ్‌ తాను ఈ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు. వాధిరాజు ఆర్థిక శాస్త్రం, సంస్కృత సాహిత్యం రెండింటికీ తన విస్తృత పరిశోధన కృషికి గుర్తింపు ఇలా పొందారు.

తెలంగాణకు చెందిన దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్‌ (వైద్యం)

ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి ఛైర్మన్‌, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణులు డాక్టర్‌ దువ్వూరి నాగేశ్వరరెడ్డిని భారత ప్రభుత్వం రెండో అత్యున్నత పౌర పుస్కారం పద్మ విభూషణ్‌ వరించింది. ఆయనకు ఇప్పటికే కేంద్రం పద్మశ్రీ, పద్మభూషణ్‌ అవార్డులతో సత్కరించింది. మూడు పద్మ పురస్కారాలు అందుకున్న ఏకైక డాక్టర్‌గా డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి రికార్డ్‌ సృష్టించారు. నాగేశ్వరరెడ్డి.. ఏపీలోని విశాఖలో జన్మించారు. నిమ్స్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులుగా సేవలు అందించిన డాక్టర్ నాగేశ్వరరెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు.

తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ (ప్రజావ్యవహారాలు)

ప్రతిష్ఠాత్మక పురస్కారం పద్మశ్రీకి ఎంపికైన మందకృష్ణ మాదిగ జీవన ప్రస్థానం.. అనేక ఉద్యమాలతో ముడివేసుకొని ఉంది. మాదిగల కోసం ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని ప్రారంభించిన ఆయన.. దివ్యాంగులు, వృద్ధులు, హృద్రోగంతో బాధపడుతున్న చిన్నారుల తదితరుల కోసం ఉద్యమాలు నిర్మించారు. మంద కృష్ణ మాదిగ స్వస్థలం వరంగల్‌ జిల్లా హన్మకొండ దగ్గర న్యూశాయంపేట. 1965లో ఆయన జన్మించారు. తండ్రి పేరు కొమురయ్య, తల్లి కొమురమ్మ. ఎస్సీ రిజర్వేషన్‌ ఫలాల విషయంలో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ప్రకాశం జిల్లా ఈదుముడిలో 13 మంది యువకులతో 1994 జూలై7న మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి స్థాపించారు. ఉమ్మడి ఏపీవ్యాప్తంగా మాదిగ దండోరా ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లారు. మంద కృష్ణ తన పేరు చివర మాదిగ సామాజికవర్గం పేరును కలుపుకొని మందకృష్ణ మాదిగగా ప్రకటించుకున్నారు.

Next Story