అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం
The second phase of Amaravati Farmers' Maha Padayatra begins. అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 1000 రోజులకు చేరింది.
By అంజి Published on 12 Sep 2022 5:33 AM GMTఅమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 1000 రోజులకు చేరింది. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని ప్రాంత రైతులు రెండో విడత మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. సోమవారం వెంకటపాలెంలోని టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత స్వామి వారి రథాన్ని ముందుకు నడిపి మహా పాదయాత్ర 2.0 ప్రారంభించారు. రైతులు, మహిళలతో కూడిన పాదయాత్ర కృష్ణాయపాలెం, పెనుమాక, యర్రబాలెం మీదుగా 15 కిలోమీటర్ల మేర ఈరోజు సాయంత్రం మంగళగిరికి చేరుకుంటుంది.
పాదయాత్ర 2.0 ప్రారంభం సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అమరావతి పరిరక్షణ సమితి(ఏపీఎస్), జేఏసీ నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ 1000 రోజులకు చేరుకున్న ఆందోళన సందర్భంగా అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాల రైతులు, మహిళలు, రైతు కూలీలు విడతల వారీగా పాదయాత్రలో పాల్గొననున్నారు. 60 రోజుల పాటు జరిగే ఈ మహా పాదయాత్ర 12 పార్లమెంటు నియోజకవర్గాలు, 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగనుంది.
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుందని రైతులు, మహిళలు పాదయాత్రలో ప్రజలకు వివరిస్తారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని డీజీపీ అనుమతి నిరాకరించడంతో ఏపీ హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. అయితే పాదయాత్రలో కేవలం 600 మంది మాత్రమే పాల్గొనే అవకాశం ఉందని తెలిపింది.
అమరావతి మహా పాదయాత్ర వెంకటపాలెం లోని వెంకటేశ్వర్ల స్వామి ఆలయం నుంచి మొదలైనది.#Day1#AmaravatiFarmersMarch2022 pic.twitter.com/5lBzeOaKuC
— JPR Jayapal Reddy (@JPRJayaPalReddY) September 12, 2022