రేవంత్ రెడ్డే సీఎం కావాలి: జేసీ ప్రభాకర్ రెడ్డి

తెలంగాణలో సీఎం అభ్యర్థి ప్రకటనపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. సీఎంగా కాంగ్రెస్‌ ఎవరిని ప్రకటిస్తుందోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By అంజి  Published on  5 Dec 2023 12:16 PM IST
Telangana CM , Revanth Reddy, JC Prabhakar Reddy, TDP

రేవంత్ రెడ్డే సీఎం కావాలి: జేసీ ప్రభాకర్ రెడ్డి

తెలంగాణలో సీఎం అభ్యర్థి ప్రకటనపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. సీఎంగా కాంగ్రెస్‌ ఎవరిని ప్రకటిస్తుందోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం అంశంపై ఏపీ టీడీపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికంగా మారాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటం సంతోషించదగ్గ విషయమని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడేనన్న ఆయన.. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ మిత్ర పక్షాలేనని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుందన్నారు.

రాష్ట్ర విభజన అనంతరం పంపకాల విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి ఇప్పుడు ఛాన్స్‌ వచ్చిందని చెప్పారు. ఇక ఏపీలో కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మరోసారి సీఎం పదవి చేపడతారని అన్నారు. ఏపీలో గురువు చంద్రబాబు, తెలంగాణలో శిష్యుడు రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉంటే.. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు సులభంగా పరిష్కరించుకోవచ్చని అన్నారు. అధికారంలో ఉన్న పార్టీపై ప్రజా వ్యతిరేకత ఉంటుందన్న ఆయన.. ఏపీలో సుపరిపాలన అందించే సత్తా కేవలం చంద్రబాబుకే ఉందన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి: సోర్సెస్

తెలంగాణ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రం కోసం పోరాటానికి నాయకత్వం వహించి, పోరాటాన్ని నేరుగా కేసీఆర్ వద్దకు తీసుకెళ్లిన రేవంత్‌ రెడ్డి రేపు లేదా రేపటి రోజు ప్రమాణం చేయవచ్చని వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వవచ్చు లేదా మంచి పోర్ట్‌ఫోలియోలో చోటు కల్పించవచ్చు. రాష్ట్రంలో రొటేషన్ ముఖ్యమంత్రి ఫార్ములా ఉండదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Next Story