పర్యాటకులే లంబసింగికి శాపంగా మారుతున్నారా?

విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని లమ్మసింగి (లంబసింగి) ఇటీవలి కాలంలో ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ లా మారిపోయింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Jan 2024 4:30 AM GMT
environment, Lambasinghi, tourists, Vizag Agency

పర్యాటకులే లంబసింగికి శాపంగా మారుతున్నారా? 

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని లమ్మసింగి (లంబసింగి) ఇటీవలి కాలంలో ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ లా మారిపోయింది. విశాఖపట్నం నగరానికి 130 కి.మీ.. నర్సీపట్నం నుండి 30 కి.మీ దూరంలో ఉన్న లంబసింగి గ్రామం 10 సంవత్సరాల కిందట చాలా ప్రశాంతంగా ఉండేది. పొగమంచులో కొండల మధ్య ఈ ప్రాంతాన్ని చూడడానికి ఇప్పుడు పలు రాష్ట్రాల నుండి ప్రజలు వస్తూ ఉన్నారు.

ఎంతో మంది ఈ ప్రదేశాన్ని సందర్శించడమే కాకుండా.. రాత్రి సమయాల్లో తమ గుడారాలను వేసుకుని, రాత్రిపూట నక్షత్రాలను చూస్తూ, చల్లని ఉదయపు పొగమంచులో తడుస్తూ, ప్రశాంతమైన ప్రకృతిని ఆస్వాదించి వెళ్లిపోయేవారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా, లమ్మసింగి ప్రాంతంలో డిసెంబర్-జనవరి నెలల్లో అకస్మాత్తుగా సందర్శకుల రద్దీ పెరిగిపోయింది. ఈ ప్రదేశం, అక్కడి వాతావరణం గురించి సమాచారం సోషల్ మీడియాలో ప్రసారం చేశారు. కొన్ని వార్తా నివేదికలు కూడా వచ్చాయి. దీంతో ఊహించని విధంగా పర్యాటకులు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు.

ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా నుండి వచ్చే పర్యాటకులలో అరకు వ్యాలీకి క్రేజ్ అలాగే ఉన్నప్పటికీ.. లమ్మసింగిలో కూడా సందర్శకుల తాకిడి పెరిగింది, వైజాగ్, ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర కోస్తా జిల్లాలు, తెలంగాణ నుండి కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో వారాంతపు రద్దీ ఇప్పుడు కనీసం 10,000-15,000 మంది వరకూ ఉంటుంది. వీరు చేసే అరుపులు, హూటింగ్, మందు తాగడం, ఎక్కడ పడితే అక్కడ చెత్తవేయడం, కొందరు చేసే అతి కారణంగా మొదలయ్యే గందరగోళం వంటివి కారణంగా సుందరమైన ప్రదేశం ప్రశాంతత పూర్తిగా నాశనం అవుతూ ఉంది.

సందర్శకుల అనుభవాలు:

“కోవిడ్ వ్యాప్తి చెందడానికి ముందు చలికాలంలో ఎక్కువగా ఇక్కడకు వచ్చాను. దట్టమైన పొగమంచు, మేఘాలతో కప్పబడిన ఉదయాలు ఎంతో బాగా ఉండేవి. పొగమంచు చాలా దట్టంగా ఉండేది, మీ ముందు ఉన్న వ్యక్తిని మీరు చూడలేరు. సేంద్రీయ స్ట్రాబెర్రీలను చూస్తూ ఉండడం.. నిజమైన స్ట్రెస్-బస్టర్. అయితే, టీ అందించే కొన్ని రోడ్‌సైడ్ షాపులు తప్ప.. మంచి షాపులు ఎక్కడా కనిపించవు. ఒక కప్పు వేడి కాఫీ తాగడానికి ఇక్కడ మాకు ఒక్క మంచి ప్రదేశం కూడా దొరకలేదు. సౌకర్యాలను పెంచుకుంటే ఈ ప్రదేశం అందమైన పర్యాటక ప్రదేశంగా మారే అవకాశం ఉంది” అని కంటెంట్ రైటర్, వైజాగ్ నివాసి ఇషితా రే అన్నారు.

డ్రాగన్ జేడ్ బైకింగ్ క్లబ్ (DJBC) కి చెందిన అద్నాన్ సబువాలా.. ఈ ప్రదేశానికి చేరుకోడానికి ఉన్న రహదారులు అద్భుతంగా ఉన్నాయని, తెల్లవారుజామున పొగమంచు, మంచు బిందువులను ఆస్వాదిస్తూ డ్రైవింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. “ఒక అడ్వెంచర్ ట్రావెల్ కంపెనీ నుండి, మేము రాత్రిపూట బస చేయడానికి టెంట్లను అద్దెకు తీసుకున్నాము. అయితే ఆ ప్రాంతమంతా చెత్తాచెదారం కనిపించింది. అందమైన ప్రదేశం చక్కగా ఉండాలని.. శుభ్రంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, ” అని డిజెబిసి నాయకుడు కిరణ్ పొల్లిపల్లి అన్నారు.

చెత్తాచెదారం, కాలుష్యం, చెట్ల నరికివేత, రద్దీ

ఏజెన్సీ ఏరియాలో విపరీతమైన రద్దీ ఉండడం ఆందోళన కలిగిస్తూ ఉందని పర్యావరణ ప్రేమికుడు సోహన్ హతంగడి అన్నారు. “ప్లాస్టిక్ చెత్త, చెత్తను కాల్చడం, చెట్ల నరికివేత, రద్దీతో వాతావరణం గత కొంతకాలంగా వేడెక్కుతోంది. గుడారాలు వేయడం కోసం, విజయనగరం వరకు హైవే నిర్మించడం కోసం చాలా చెట్లు నరికివేశారు. ట్రాక్టర్‌తో పొలాలను దున్నడం ద్వారా పూడిక మట్టిని తీసివేశారు. లమ్మసింగిలో ఘన వ్యర్థాలను పారవేసే వ్యవస్థ లేదు. ప్లాస్టిక్‌తో సహా చెత్తను అంతా కాల్చివేస్తూ వాయు కాలుష్యాన్ని పెంచుతున్నారు" అని బాధను వ్యక్తం చేశారు.

ఈ సంవత్సరం, లమ్మసింగిలో రాత్రి ఉష్ణోగ్రత 10-12 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. తెల్లవారుజామున దాదాపు ఏడు నుండి ఎనిమిది డిగ్రీలు, పగటిపూట 15 నుండి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటోందని సోహన్ తెలిపారు. డిసెంబరు మొదట్లో వచ్చిన తుఫాను కారణంగా స్ట్రాబెర్రీ ఉత్పత్తిలో దాదాపు 80 శాతం నష్టం జరిగింది. అవకాడో, గుమ్మడికాయ వంటి ఇతర ఉత్పత్తులకు ఊహించని నష్టం కలిగింది. చెత్త నిర్మూలన వ్యవస్థ, ప్రాంత అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలపై సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారికి ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా ఎవరూ స్పందించలేదన్నారు.

పుంజుకున్న టెంట్ టూరిజం:

కొంతమంది టూర్ ఆపరేటర్లు రాత్రిపూట సందర్శకుల కోసం బహిరంగ మైదానంలో డజన్ల కొద్దీ గుడారాలను వేస్తున్నారు. వారు ప్రధానంగా లమ్మసింగికి చల్లని పొగమంచు, సూర్యోదయాన్ని ఆస్వాదించడానికి వస్తారు. రూ. 1,500 నుండి 2,500 మధ్య టెంట్ల నిర్వాహకులు వసూలు చేస్తుంటారు. అటాచ్డ్ టాయిలెట్లు లేవు. ఖరీదైన లాగ్, సిమెంట్ క్యాబిన్‌లు ఉన్నాయి, వాటికి మరుగుదొడ్లు ఉన్నాయి. ఇక ఈ ప్రాంతంలో మరిన్ని కొత్త నిర్మాణాలు వస్తున్నాయి.

పర్యాటకం కారణంగా ప్రతికూలతలు:

- సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ లేకపోవడం కారణంగా చాలా చెత్త పేరుకుపోతుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఆ ప్రాంతాన్ని దెబ్బతీస్తాయి.

- పర్యాటకులు, చిరువ్యాపారులు చెత్తను వేయడం మరియు వ్యర్థాలను కాల్చడం.

- కొండలను చదును చేయడం, స్థానిక టూర్ ఆపరేటర్లు టెంట్లు వేయడానికి స్థలాలను సిద్ధం చేయడానికి యంత్రాలను ఉపయోగించి మట్టిని తొలగించడం.

- శీతాకాలంలో సందర్శకుల రద్దీ.

- సందర్శకులు చేసే ఊహించని శబ్ద కాలుష్యం, డ్రంక్ అండ్ డ్రైవ్, మద్యం మత్తులో గొడవలు.. ఇవన్నీ సుందరమైన ప్రదేశం ప్రశాంతతను ఊహించని విధంగా ప్రభావితం చేస్తాయి.

- రాష్ట్ర రహదారి నిర్మాణానికి చింతపల్లి-లమ్మసింగి మధ్య ఉన్న పెద్ద చెట్లకు నరకడం.

- లమ్మసింగిలో సరైన వసతి, రెస్టారెంట్లతో సహా మౌలిక సదుపాయాల కొరత.

- నిధుల కొరత కారణంగా 2017 నుండి పర్యాటక శాఖ రిసార్ట్‌లు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయి.

- సరైన పబ్లిక్ టాయిలెట్లు లేవు, సరైన పార్కింగ్ సౌకర్యాలు లేవు, శీతాకాలపు వారాంతాల్లో చాలా వాహనాలు ఈ ప్రాంతానికి చేరుకోవడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడతాయి.

పర్యాటకం అనుకూలతలు:

- లమ్మసింగి వంటి వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం, డేరా నిర్వాహకులు, సందర్శకులకు ఆహార పదార్థాలను సరఫరా చేసే కొన్ని గిరిజన కుటుంబాలకు పర్యాటకం రెండు నెలల పాటు అదనపు ఆదాయాన్ని అందిస్తుంది.

- లమ్మసింగిలోని చల్లని వాతావరణంలో కాఫీ నుండి మసాలా దినుసులు, స్ట్రాబెర్రీ, అవకాడో వరకు వివిధ రకాల పంటలను పండించవచ్చు.

- రూ. 35 కోట్లతో, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, GOI, AP గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ సంయుక్తంగా నిధులతో సమీపంలోని తాజంగిలో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం రాబోతోంది.

Next Story