తోడి కోడళ్ల పోరులో సర్పంచ్‌గా విజయం సాధించిన అసెంబ్లీ స్పీకర్‌ సతీమణి వాణీ

Thammineni Seetharam Wife Vani Won As Sarpanch. తొగరాం పంచాయతీ సర్పంచ్‌గా ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం భార్య వాణి సీతారాం గెలు పొందారు.

By Medi Samrat  Published on  18 Feb 2021 2:44 AM GMT
Thammineni Seetharam Wife Vani Won As Sarpanch.

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర ఆసక్తి పెంచిన తొగరాం ఫలితం వచ్చేసింది. శ్రీకాకుళం జిల్లా అముదాలవలస మండలం తొగరాం పంచాయతీ సర్పంచ్‌గా ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం భార్య వాణి సీతారాం గెలు పొందారు. అయితే ఆమె పోటీ చేస్తున్నది కూడా తోడి కోడలు పైనే కావడంత రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంచాయతీపై అందరికీ ఆసక్తి పెరిగింది. శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం భార్య వాణీ సీతారాం వైసీపీ మద్దతుతో బరిలో దిగితే, టీడీపీ మద్దతుతో తమ్మినేని అన్నయ్య దివంగత శ్యామలరావు సతీమణి భారతమ్మ బరిలో నిలిచారు. దీంతో తోడికోడళ్ల మధ్య రసవత్తరంగా సాగిన ఈ పోరులో స్పీకర్‌ భార్య విజయం సాధించారు.

చాలా చోట్ల ఈ సారి తోడికోడళ్ల మధ్య పోరు సర్వసాధారణమే అయితే.. తొగరాం స్పీకర్‌ సొంత గ్రామం కావడం, ప్రత్యర్థి పార్టీ మద్దతుతో వదిన పోటీలో ఉండటం పోటీ మరింత రసవత్తరంగా మారింది. అలాగే స్పీకర్‌ భార్య గతంలో ఎంపీపీగా మండలాన్ని అభివృద్ధి చేశారనే పేరు ఉంది. దీనికి తోడు జిల్లా టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ విప్‌ కూన రవికుమార్‌ భారతమ్మ విజయం కోసం విశేషంగా కృషి చేయడంతో అందరీ చూపు తొగరాం గ్రామంపైనే ఉంది. పంచాయతీ ఎన్నికల సందర్బంగా ఇద్దరు కూడా పోటీ పడి మరీ ప్రచారం నిర్వహించారు. ఇద్దరు కీలక నేతలు అక్కడే మకాం వేసి ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకున్నారు.

స్పీకర్‌ సీతారాం సైతం తన భార్య విజయం కోసం ఎంతగానో కృషి చేశారు. గతంలో సీతారాం తల్లి ఇందుమతి ఎంపీటీసీగా పోటీ చేయగా, భారతమ్మ చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎలాగైనా తన భార్య విజయం సాధిస్తేనే రాష్ట్ర స్థాయిలో తన పరువు నిలుస్తుందని ఆయన పట్టుదలగా పావులు కదిపారు. పది రోజులుగా గ్రామంలో బస చేసి వ్యూహాలు రచించారు. మరోవైపు తన పట్టును నిలపుకొనేందుకు రవికుమార్‌ కూడా భారతమ్మ విజయానికి కృషి చేశారు. ఈ పంచాయతీకి చెందిన ఓటర్లు వివిధ జిల్లాల్లో ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా తమ మద్దతుదారులు విజయం సాధించేందుకు బావ, బావమరుదులు సీతారాం, రవికుమార్‌ ఎత్తులకు పై ఎత్తులు వేశారు. అత్యంత ఆసక్తిని పెంచిన ఈ పంచాయతీ ఎన్నికల్లో వాణీ సీతారాం విజయం సాధించారు. ఆమె ప్రత్యర్థి భారతమ్మపై 540 ఓట్ల తేడాతో గెలుపొందారు. గతంలో స్పీకర్ తల్లి ఓటమికి.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల ఫలితాలో ప్రతీకారం తీర్చుకోగలిగారు.




Next Story