కుప్పంలో టెన్షన్ టెన్షన్

Tension prevails in Kuppam.చిత్తూరు జిల్లా కుప్పంలో హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Aug 2022 6:32 AM GMT
కుప్పంలో టెన్షన్ టెన్షన్

చిత్తూరు జిల్లా కుప్పంలో హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు రెండో రోజు ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకుంటామ‌ని వైసీపీ శ్రేణులు పేర్కొన‌డంతో పాటు బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో గురువారం ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. కుప్పం పరిధిలోని ఆర్టీసీ బస్సులు డిపోల‌కే ప‌రిమితం అయ్యాయి. ఇక న‌గ‌రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహ‌రించారు. ప‌లు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు.

మ‌రో వైపు వైసీపీ, టీడీపీ వర్గాలు బలప్రదర్శనకు సిద్ధమయ్యాయి. ఓ వైపు వైసీపీ భారీ నిరసన ప్రదర్శనకు తరలి రావాలంటూ క్యాడర్ కు పిలుపునిచ్చింది. ఎమ్మెల్సీ భరత్ ఇంటి నుంచి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వైయస్సార్ విగ్రహం వరకు వైసిపి నిరసన ప్రదర్శన చేయనుంది. మ‌రోవైపు చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ చిత్తూరు పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు పులివ‌ర్తి నాని పిలుపు మేర‌కు భారీ ఎత్తున తెలుగు దేశం శ్రేణులు కుప్పం చేరుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న‌టెన్ష‌న్ నెల‌కొంది.

అన్నా క్యాంటీన్ ద‌గ్గ‌ర ఉద్రిక్తత

చంద్ర‌బాబు ప్రారంభించాల్సిన అన్నా క్యాంటీన్ ద‌గ్గ‌ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా వైసీపీ శ్రేణులు నిర‌స‌న‌కు దిగాయి. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో కార్య‌క‌ర్త‌లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌ను వైసీపీ కార్య‌క‌ర్త‌లు చించేశారు. అలాగే ప్యాలెస్‌ రోడ్డులో ఉన్న తెలుగుదేశానికి సంబంధించిన బ్యానర్లు, కౌటౌట్లు ధ్వంసం చేశారు. దీంతో కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడిని నిరసిస్తూ చంద్రబాబు కుప్పంలో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. టీడీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి.

బుధవారం చంద్రబాబు రామకుప్పం మండలంలోని కొంగనపల్లె, కొళ్లుపల్లె, శివునికుప్పం, చల్దిగానిపల్లెల్లో పర్యటించారు. వైసీపీ ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టారు. పులివెందులలోనూ వైసీపీని భూస్థాపితం చేస్తానని సవాల్ విసిరారు. నీతి, న్యాయానికి తప్ప.. వైసీపీ రౌడీ రాజకీయాలకు భయపడనని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ అవినీతి సొమ్మంతా కక్కిస్తామని చెప్పారు.

Next Story