రాజమహేంద్రవరంలో ఉద్రిక్తత.. కుర్చీలు, రాళ్లు, సీసాలతో దాడులు.. అసలేం జరిగిందంటే?
Tension in Rajahmundry.. Attacks with chairs, stones and bottles on Amaravati farmers' march. అమరావతి రైతుల పాదయాత్ర 37వ రోజు రాజమహేంద్రవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది . అమరావతి జేఏసీ రైతుల పాదయాత్రకు
By అంజి
అమరావతి రైతుల పాదయాత్ర 37వ రోజు రాజమహేంద్రవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది . అమరావతి జేఏసీ రైతుల పాదయాత్రకు అనుమతి ఇచ్చిన రూట్‌లోనే ఆజాద్‌చౌక్‌లో నిరసన సభకు రాజమండ్రి ఎంపీ భరత్‌రామ్ రూట్ నిర్ణయించగా.. పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో ఇరువర్గాలు తమ సత్తా చాటేందుకు ఈ ప్రాంతం వేదికగా మారింది. రైతులు ఆ ప్రాంతానికి చేరుకోగానే అప్పటికే అక్కడ బైఠాయించిన వందలాది మంది ఎంపీ భరత్ అనుచరులు, మూడు రాజధానుల మద్దతుదారులు నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు.
రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రియల్ ఎస్టేట్ బ్యాచ్ గో బ్యాక్, నకిలీ రైతులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అమరావతి రైతులు కూడా వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉద్రిక్తత పెరుగుతున్న దశలో ఇరు వర్గాల మధ్య పోలీసులు అడ్డుగా నిలిచారు. ఈలోగా కొందరు వాటర్ బాటిళ్లు, గ్లాసులు, కుర్చీలు విసిరేయడంతో కొద్దిసేపు పరిస్థితి అదుపు తప్పింది. ఒక స్థాయిలో గొడవ జరిగింది.
అమరావతి నుంచి అరసవల్లి రైతు మహా పాదయాత్ర ఉదయం రాజమండ్రిలోని మల్లయ్యపేట నుంచి ప్రారంభమైంది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ యాత్రను ప్రారంభించి కాసేపు రైతులతో కలిసి నడిచారు. పాదయాత్రలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రులు ఎన్ చినరాజప్ప, దేవినేని ఉమా మహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, పార్టీ రాష్ట్ర నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. రైతులకు మద్దతుగా ఆజాద్ చౌక్ ఏరియాతో పాటు ఇతర ప్రాంతాల్లో మైనార్టీలు ఏర్పాటు చేసిన స్వాగత బ్యానర్లను పోలీసులు తొలగించారు. దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు మైనార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
తెలుగుదేశం, జనసేన, బిజెపి శిబిరాల కార్యకర్తలు అమరావతి రైతుల పక్షాన ఉండగా, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలు ఎంపీ భరత్‌కు అండగా నిలిచారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు తమ ప్రసంగాలతో రాజమహేంద్రవరంలో గందరగోళ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర మార్గంలో నిరసన సభకు అనుమతి ఎలా ఇస్తారని పలువురు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై సీనియర్ అధికారిని ప్రశ్నించగా.. శాంతియుతంగా నిరసనలు చేపట్టవచ్చని స్వయంగా డీజీపీ చెప్పారని, దాని ప్రకారమే అనుమతి ఇచ్చామని చెప్పారు.
రైతుల వేషధారణలో ఉన్న తెలుగుదేశం పార్టీ అనుచరులు, బ్లేడ్ బ్యాచ్, రౌడీషీటర్లు కూడా ఉన్నారని ఎంపీ భరత్ ఘాటుగా ఆరోపించారు. నిజమైన రైతులు రెండు వందలకు మించి లేరని, మిగిలిన వారు పెయిడ్ బ్యాచ్ అని ధ్వజమెత్తారు. నిజమైన రైతులే పాదయాత్రను ఆపాలని కోరారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ భరత్ హెచ్చరించారు. ఎంపీ భరత్ వర్గం కావాలనే అశాంతి సృష్టించిందని టీడీపీ నేతలు ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నేతలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని వారు ధ్వజమెత్తారు.