అమరావతి: కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ చేపట్టిన ప్రజా పోరు ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుంటూరులో ర్యాలీగా బయల్దేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదంటూ కంకరగుంట ప్లైఓవర్ వద్ద అంబటికి పోలీసులు అడ్డొచ్చారు. ఈ క్రమంలోనే అంబటికి, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల బారికేడ్లను అంబటి తోసేశారు. పోలీసులు తమను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని, బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారని అంబటి మండిపడ్డారు.
పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కాలేజీలను అప్పగించవద్దని, అలా చేస్తే పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు ర్యాలీలు చేపట్టారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ 'ప్రజాపోరు' నిరసన ర్యాలీ చేపట్టింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు ముందుగానే స్పష్టం చేశారు.