తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్.వి.పురం టోల్ ప్లాజా వద్ద కొందరు విద్యార్థులు రెచ్చిపోయారు. పుత్తూరు ప్రైవేట్ కాలేజీలో లా చదువుతున్న తమిళనాడు విద్యార్థులు తిరుపతిలో గత కొద్దిరోజులుగా పరీక్షలు రాస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం నాడు పరీక్షల చివరి రోజు కావడంతో తిరుపతి నుంచి తిరుగు ప్రయాణంలో వడమాలపేట ఎస్‌వీ పురం టోల్ ప్లాజా వద్ద లా చదువుతున్న విద్యార్థి కారు టోల్ రుసుము చెల్లింపులో టోల్ యాజమాన్యం సిబ్బందితో గొడవ దిగారు. రుసుము చెల్లించడానికి ఆ వాహనానికి ఉన్న ఫాస్ట్ ట్యాగ్‌లో డబ్బులు లేనందున టోల్ సిబ్బంది వాహనాన్ని వెనక్కి తీసి మిగిలిన వారికి దారి వదలమని చెప్పారు.
దీంతో మాట మాట పెరిగి తమిళనాడు విద్యార్థులు మొదటగా టోల్ సిబ్బందిపై హెల్మెట్ తో దాడి చేశారు. రుసుము చెల్లింపు జరగకపోవడం గొడవకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఘటనా స్థలానికి చేరుకున్న వడమాల పేట ఎస్ఐ రామాంజనేయులు లా విద్యార్థులతో ముఖాముఖిగా జరిగిన సంఘటనపై కంప్లైంట్ ఇవ్వమని పబ్లిక్ వాహనాలకు ఇబ్బంది కలగకుండా పక్కకు రమ్మని చెప్పినప్పటికీ లా విద్యార్థులు మొండిగా వ్యవహరించడమే కాకుండా టోల్ ప్లాజా ప్రదేశంలోనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
చిలికి చిలికి వాగ్వాదం కాస్తా పెద్ద గొడవగా మారింది. టోల్ ప్లాజా ప్రదేశానికి చేరుకున్న స్థానికుల పై దాడికి దిగారు లా విద్యార్థులు. అనంతరం స్థానికులు కూడా తిరగబడి వారిపై దాడి చేయడంతో పోలీసులుకు తగినంత సంఖ్యాబలం లేనందున నియంత్రించలేకపోయారు. లా విద్యార్థులు ప్రాంతీయ భావాన్ని పదేపదే వ్యక్తపరుస్తూ టోల్గేట్ లైన్‌లో తమిళనాడు వాహనాలకు దారి వదులుతూ ఏపీకి సంబంధించిన వాహనాలను నిర్బంధిస్తూ ధర్నాకు దిగారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని వనమాలపేట ఎస్సై రామాంజనేయులు తెలిపారు.