పాకిస్థాన్ కాల్పుల్లో..తెలుగు జవాన్ వీర మరణం

ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ వీర మరణం పొందారు.

By Knakam Karthik
Published on : 9 May 2025 12:56 PM IST

Andrapradesh News, Satya Sai District, Telugu Jawan Killed, Murali Naik, Indian Soldier, Pakistani Firing, Operation Sindoor,

పాకిస్థాన్ కాల్పుల్లో..తెలుగు జవాన్ వీర మరణం

ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ వీర మరణం పొందారు. ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ ఆప‌రేష‌న్‌ను సహించ‌లేని దాయాది పాకిస్థాన్ వ‌క్ర‌బుద్ధితో భార‌త స‌రిహ‌ద్దు ప్రాంతాల‌పై క్షిప‌ణి, డ్రోన్ దాడుల‌కు పాల్ప‌డుతోంది. ఈ క్రమంలో జ‌మ్మూక‌శ్మీర్‌లో పాకిస్థాన్ జ‌రిపిన కాల్పుల్లో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం పొందారు. మృతిచెందిన జ‌వాన్‌ను ముర‌ళీ నాయ‌క్‌గా గుర్తించారు.

వీర జవాన్‌ది ఏపీలోని స‌త్య‌సాయి జిల్లా గోరంట్ల మండ‌ల ప‌రిధిలోని క‌ల్లి తండా. గురువారం రాత్రి స‌రిహ‌ద్దు వెంబ‌డి పాక్ కాల్పులు జ‌ర‌ప‌గా మ‌న సైన్యం కూడా దీటుగానే బదులిచ్చింది. ఈ ఎదురుకాల్పుల్లో ముర‌ళీ నాయ‌క్ చ‌నిపోయిన‌ట్లు స‌మాచారం. శ‌నివారం స్వ‌గ్రామానికి వీర జ‌వాన్ పార్థివ దేహం రానున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, వీర జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ సోమందేప‌ల్లి మండ‌లం నాగినాయ‌ని చెరువుతండాలో పెరిగాడు. సోమందేప‌ల్లిలోని విజ్ఞాన్ స్కూల్‌లో చ‌దివాడు. జ‌వాన్ మృతితో ఆయ‌న కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు. దీంతో స్వ‌గ్రామం క‌ల్లితండాలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

ఏపీకి చెందిన మురళీ నాయక్ పాకిస్తాన్‌ జరిపిన కాల్పుల్లో మరణించడంపై రాష్ట్ర సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుడికి నివాళులు అర్పిస్తున్నట్లు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

అటు మంత్రి నారా లోకేశ్ కూడా జవాన్ మురళీ నాయక్ మరణంపై స్పందించారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తాం. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తాం. అని మంత్రి లోకేశ్‌ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Next Story