అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు అవినాష్‌రెడ్డికి

By అంజి  Published on  31 May 2023 11:25 AM IST
Telangana High Court, anticipatory bail, MP YS Avinash Reddy, YS Viveka

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు అవినాష్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా హ‌త్య కేసులో సీబీఐ త‌న‌ను అరెస్టు చేయొద్ద‌ని కోరుతూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో అవినాష్‌కు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు.. ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లకూడదని, సీబీఐ విచారణకు సహకరించాలని ఆదేశించింది. అవినాష్‌ను అరెస్టు చేసిన‌ట్లు అయితే 5 ల‌క్ష‌ల రూపాయల పూచీక‌త్తుతో బెయిల్‌పై విడుద‌ల‌కు సీబీఐకి కోర్టు ఆదేశాలిచ్చింది. సాక్షుల‌ను ప్ర‌భావితం చేయొద్ద‌ని అవినాష్‌ రెడ్డి హైకోర్టు ఆదేశించింది. జూన్ నెలాఖ‌రు వ‌ర‌కు ప్ర‌తి శ‌నివారం ఉద‌యం 10 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు సీబీఐ ఎదుట హాజ‌రు కావాల‌ని ఆదేశించింది.

సీబీఐకి అవ‌స‌ర‌మైన‌ప్పుడు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. వైఎస్ వివేకా హ‌త్య కేసులో సీబీఐ విచార‌ణ నేప‌థ్యంలో త‌న‌కు ముంద‌స్తు బెయిల్ కావాలంటూ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై ఈ నెల 27న వాద‌న‌లు ముగించిన హైకోర్టు.. ఇవాళ తీర్పు వెల్ల‌డించింది. గత నెల 19వ తేదీ నుంచి అవినాష్‌ రెడ్డి అరెస్ట్‌పై ఉత్కంఠ సాగుతూ వచ్చింది. అంతకుముందు ఏడు సార్లు సీబీఐ విచారణకు హాజరైన అవినాష్‌ రెడ్డి.. ఆ తర్వాత పలు కారణాలు చెబుతూ విచారణకు రాకుండా ఉన్నారు. అవినాష్ రెడ్డి తల్లి అస్వస్థతకు గురికావడంతో పులి వెందుల నుంచి ఆమెను కర్నూలుకు చికిత్స కోసం తరలించారు. అప్పటి నుంచి సీబీఐ విచారణకు హాజరు కాలేనంటూ అవినాష్ చెప్పుకొచ్చారు. దీంతో అవినాష్‌ను సిబిఐ అరెస్ట్ చేయడానికి సిద్దమైందని ప్రచారం జరిగింది.

Next Story