సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన అండ‌ర్‌-19 వైస్ కెప్టెన్ ర‌షీద్‌.. డిగ్రీ పూర్తి చేశాక ఎస్ఐ ఉద్యోగం

Team India U-19 Vice Captain Shaikh Rashid meets CM Jagan.టీమ్ఇండియా అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డంలో వైస్ కెప్టెన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Feb 2022 9:00 AM IST
సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన అండ‌ర్‌-19 వైస్ కెప్టెన్ ర‌షీద్‌.. డిగ్రీ పూర్తి చేశాక ఎస్ఐ ఉద్యోగం

టీమ్ఇండియా అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డంలో వైస్ కెప్టెన్ షేక్‌ రషీద్ కీల‌క పాత్ర‌ను పోషించిన సంగ‌తి తెలిసిందే. బుధ‌వారం ర‌షీద్.. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్.. ర‌షీద్‌ను అభినందించారు. ప్ర‌భుత్వం త‌ర‌పున పూర్తి స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తామ‌ని చెప్పారు. రూ.10 ల‌క్ష‌ల న‌జ‌రానాతో పాటు గుంటూరులో ఇంటి స్థ‌లాన్ని కేటాయించారు. ర‌షీద్ డిగ్రీ పూర్తి చేసిన త‌రువాత సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్ఐ) ఉద్యోగం ఇచ్చేలా ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, శాప్ అధికారులు, రషీద్ తండ్రి బాలీషా పాల్గొన్నారు.

అనంత‌రం ర‌షీద్ విలేక‌రుల‌తో మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అండర్‌ 19 ప్ర‌పంచ‌కప్‌ గెలవడం పట్ల చాలా ఆనందంగా ఉందని.. సీనియ‌ర్ స్థాయిలో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వ‌హించి ప్ర‌పంచ‌క‌ప్‌ను గెల‌వాల‌న్నాదే త‌న ల‌క్ష్య‌మ‌న్నాడు. క్రికెట్‌లో త‌న‌కు స‌చిన్ టెండూల్క‌ర్ స్పూర్తి అని అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌పై ఆలోచన లేదని రంజీ ట్రోఫీలో రాణించి టీమ్ఇండియాలో స్థానం సంపాదించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు చెప్పాడు. చిన్నప్పటి నుంచి తన తండ్రి షేక్‌ బాలీషా కష్టపడుతూ తనకు అన్ని విధాలా స‌హాయ‌స‌హ‌కారాల‌ను అందిచార‌న్నాడు. త‌న‌కు మ‌ద్ద‌తుగా ఉన్న అంద‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Next Story