సోషల్ మీడియాలో పిల్లలకు 'నో ఎంట్రీ'?.. కేంద్రానికి టీడీపీ ఎంపీ విన్నపం

సోషల్ మీడియా మత్తులో చిక్కుకుంటున్న బాల్యాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో పోరాటం ప్రారంభించింది.

By -  అంజి
Published on : 11 Feb 2026 9:14 AM IST

TDP MP Lavu Sri Krishna Devarayalu Delhi, Social Media Age Restrictions India, Children Online Safety National Policy, Ashwini Vaishnaw TDP Memorandum

సోషల్ మీడియాలో పిల్లలకు 'నో ఎంట్రీ'?.. కేంద్రానికి టీడీపీ ఎంపీ విన్నపం

సోషల్ మీడియా మత్తులో చిక్కుకుంటున్న బాల్యాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో పోరాటం ప్రారంభించింది. పిల్లల ఆన్‌లైన్ భద్రత, డిజిటల్ వ్యసనం, మానసిక ఆరోగ్య ముప్పులను దృష్టిలో ఉంచుకుని, సోషల్ మీడియా వినియోగంపై వయస్సు ఆధారిత నియంత్రణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా పిల్లల కోసం ప్రత్యేక జాతీయ విధానాన్ని రూపొందించాలని కోరుతూ మెమొరాండం సమర్పించారు. కేవలం తల్లిదండ్రులపైనే బాధ్యత నెట్టేయకుండా, సోషల్ మీడియా సంస్థలూ బాధ్యత వహించేలా చట్టపరమైన నిబంధనలు ఉండాలని ఆయన కోరారు.

భారత్‌లో పిల్లల స్మార్ట్‌ఫోన్ వినియోగంపై ఎంపీ సమర్పించిన నివేదికలోని అంశాలు భీతిగొల్పుతున్నాయి. 90 శాతం 14-16 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు ఇంట్లో స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. 75 శాతంకు పైగా పిల్లలు యాక్టివ్‌గా సోషల్ మీడియా వాడుతున్నారు. 60 శాతం మంది మైనర్లు ఆన్‌లైన్ వేధింపులకు గురవుతున్నారు. 50 శాతం మంది పిల్లలు తమ వయస్సుకు సరిపడని, హానికరమైన కంటెంట్‌ను చూస్తున్నారు.

ప్రైవేట్ మెంబర్ బిల్లు - ప్రతిపాదిత నిబంధనలు:

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గతంలో ప్రవేశపెట్టిన 'ప్రైవేట్ మెంబర్ బిల్లు'లోని ముఖ్యాంశాలను మంత్రికి వివరించారు:

కనీస వయస్సు: సోషల్ మీడియా వాడకానికి కనీస వయస్సు పరిమితి విధించాలి.

వయస్సు ధ్రువీకరణ: పక్కాగా ఏజ్ వెరిఫికేషన్ మెకానిజం ఉండాలి.

డేటా డిలీషన్: వెరిఫికేషన్ సమయంలో సేకరించిన పిల్లల డేటాను వెంటనే తొలగించాలి.

జరిమానాలు: నిబంధనలు ఉల్లంఘించే ప్లాట్‌ఫారమ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలి.

ఏపీలో కసరత్తు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్‌గా ఉందని, మైనర్ల రక్షణ కోసం పటిష్టమైన చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను పరిశీలిస్తోందని మంత్రికి వివరించారు. ఆస్ట్రేలియా (16 ఏళ్లలోపు వారికి బ్యాన్), డెన్మార్క్, మలేషియా వంటి దేశాల బాటలోనే భారత్ కూడా అడుగులు వేయాలని ఆయన సూచించారు.

Next Story