ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ(టీటీడీ) మహానాడు ప్రారంభమైంది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్‌టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాలర్పించి మహానాడును ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా పసుపు మయంగా కనిపిస్తోంది. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కార్యక్రమం కావడంతో టీడీపీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం ఉప్పొంగుతోంది. సభావేదికపై పార్టీకి చెందిన కీలక నేతలందరూ ఆసీనులయ్యారు.
ఇదిలా ఉంటే.. అంతకముందు పార్టీ శ్రేణులకు స్వాగతం పలుకుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. 'టీడీపీ 40 వసంతాలు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు యుగపురుషుడు నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలు మహానాడు వేదికపైనే అని తెలిపారు. తాను తెలుగువాడిని, తెలుగుదేశం వాడిని, మహానాడులో పాల్గొనడం తమకు దక్కిన అదృష్టమని అన్నారు. తరలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా.. ఇదే నా ఆహ్వానం' అని అన్నారు.