ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మూడేళ్ల పాలనలో ఇంతకముందు ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభం నెలకొందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ అహంభావం, చేతగాని తనం, మొండితనంతోనే ఈ అనర్థం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం నిజాలను తొక్కి పెడుతోందని ఆరోపించారు.
బహిరంగ మార్కెట్ రుణాలతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 3 ఏళ్లలో టీడీపీ హయాం కంటే రూ 86,865 కోట్లు అధికమన్నారు. ఇక కేంద్ర నుంచే వచ్చే నిధులు కూడా కలిపితే రాష్ట్ర ప్రభుత్వ మొత్తం ఆదాయం రూ 1,25,995 కోట్లు ఎక్కువ వచ్చిందన్నారు. అనేక రాష్ట్రాల కన్నా ఏపీ ఆదాయం మెరుగ్గా ఉన్నప్పటికీ.. పని తీరు, వివిధ శాఖల పురోగతిలో మాత్రం అట్టడుగున ఉందన్నారు. ఇక ఇతర రాష్ట్రాల్లో పోల్చినప్పుడు రాష్ట్రంలో కరోనా ప్రభావం తక్కువగానే ఉందన్నారు.
రెవిన్యూ లోటు, ద్రవ్య లోటు పెరిగిపోయాయని చెప్పారు. బహిరంగ మార్కెట్ బారోయింగ్స్ రూ 51,500 కోట్లకు పెరిగాయన్నారు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రూ 54 వేల కోట్ల నుంచి రూ 1,18,565 కోట్లకు పెంచేశారన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ(డిబిటి)లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 19వ స్థానానికి పడిపోయిందని, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ చేసిన మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉందని తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందని, పొదుపుశక్తి పూర్తిగా మందగించిందని యనమల అన్నారు.