కన్నుమూసిన మాజీ ఎంపీ సబ్బం హరి.. చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి
Sabbam Hari passed away.టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. కరోనాతో బాధపడుతున్న సబ్బం హరి విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
By Medi Samrat Published on 3 May 2021 12:02 PM GMTటీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. కరోనాతో బాధపడుతున్న సబ్బం హరి విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.విశేష రాజకీయ అనుభవం ఉన్న సబ్బం హరి గతంలో విశాఖ మేయర్ గానూ పనిచేశారు. 2009లో కాంగ్రెస్ తరఫున అనకాపల్లి నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఓదార్పు యాత్రలో జగన్ వెంటే నడిచినప్పటికీ ఎందుకో టీడీపీలో చేరారు. కొన్నివారాల కిందట కరోనా బారినపడిన ఆయన మొదట ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. లక్షణాలు తీవ్రం కావడంతో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా, ఇటీవల పరిస్థితి విషమించింది. ఈరోజు మధ్యాహ్నం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
సబ్బం హరి స్వస్థలం తగరపువలస సమీపంలోని చిట్టివలస. సబ్బం హరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1952 జూన్ 1న జన్మించిన సబ్బం హరి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ కార్యకర్తగా మొదలైంది. 1985లో విశాఖ నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1989 ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేల గెలుపులో ఆయనదే కీలక పాత్ర. 1995లో విశాఖ నగర మేయర్ అయ్యారు. ఆపై ఎంపీగానూ గెలిచారు. కొద్దిరోజులు జగన్ చెంతనే కూడా ఉన్నారు. 2019లో టీడీపీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
సబ్బం హరి మృతి చెందడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. సబ్బం హరి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సబ్బం హరి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. సబ్బం హరి మృతి పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. విశాఖ మేయర్ గా, ఎంపీగా సబ్బం హరి సేవలు మరువలేనివని కొనియాడారు.
తెలుగుదేశం సీనియర్ నాయకులు సబ్బం హరి గారు ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని నారా లోకేష్ ట్వీట్ చేశారు. తన నిస్వార్థ రాజకీయాలతో మాలాంటి వారికి మార్గదర్శకులుగా నిలిచారు సబ్బం హరిగారు. ఆయన లాంటి నేతను కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. ఏ విషయం పై అయినా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పే సబ్బం హరి గారు, ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేసారు. సబ్బం హరి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.