పాదయాత్రకు నారా లోకేష్ ప్లాన్‌.. 450 రోజుల షెడ్యూల్.!

TDP leader Nara Lokesh's plan for padayatra from January. తెలుగుదేశం పార్టీ అధినేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో

By అంజి  Published on  18 Sep 2022 4:37 AM GMT
పాదయాత్రకు నారా లోకేష్ ప్లాన్‌.. 450 రోజుల షెడ్యూల్.!

తెలుగుదేశం పార్టీ అధినేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా లోకేష్ యాత్ర సాగనున్నట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్‌ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.

వాస్తవానికి వచ్చే నెల నుంచి పాదయాత్ర ప్రారంభించాలని మొదట నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తే బాగుంటుందని 2023 జనవరికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అన్నీ సక్రమంగా జరిగితే సంక్రాంతి పండుగ తర్వాత టీడీపీ ఈ యాత్రను ప్రారంభించనుంది. పాదయాత్ర కోసం మొత్తం 450 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు. అంటే జనవరిలో ప్రారంభించి 2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నాటికి ముగించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

చిత్తూరు జిల్లా నుంచి యాత్రను ప్రారంభించి ఉత్తరాంధ్రలో ముగించాలని నిర్ణయించినట్లు ప్రాథమిక సమాచారం. అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా రెస్ట్‌ లేకుండా పాదయాత్ర చేయాలనే ఆలోచనలో లోకేష్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాదయాత్రలో విజయం సాధించారు. ఇప్పుడు లోకేష్ కూడా ఈ ఫార్ములానే కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సమైక్య రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కలుపుతూ పాదయాత్ర చేసిన చివరి నాయకుడిగా చంద్రబాబు రికార్డులకెక్కారు. సమైక్య రాష్ట్రంలో జగన్ కూడా పాదయాత్ర చేపట్టినా.. రాష్ట్రం విడిపోవడంతో ఆయన ప్రయాణం ఏపీకే పరిమితమైంది.

Next Story