అవ‌న్నీ జ‌గ‌న్ నాట‌క‌రెడ్డి పాల‌న‌లోనే జ‌రుగుతాయి : నారా లోకేశ్‌

TDP Leader Nara Lokesh criticise over auto fire incident.శ్రీ సత్యసాయి జిల్లా తాడిమ‌ర్రి మండ‌లం చిల్ల‌కొండ‌య్యప‌ల్లి

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 30 Jun 2022 2:05 PM IST

అవ‌న్నీ జ‌గ‌న్ నాట‌క‌రెడ్డి పాల‌న‌లోనే జ‌రుగుతాయి : నారా లోకేశ్‌

శ్రీ సత్యసాయి జిల్లా తాడిమ‌ర్రి మండ‌లం చిల్ల‌కొండ‌య్యప‌ల్లి వ‌ద్ద కూలీల‌తో వెలుతున్న ఆటోపై హెటెన్ష‌న్ వైర్లు తెగి ప‌డి ఐదుగురు స‌జీవ‌ద‌హ‌న‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై ప‌లువురు ప్ర‌ముఖులు దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఐదుగురి ప్రాణాలు పోయేందుకు కార‌ణ‌మైన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, బాధితుల‌ను ఆదుకోవాల‌న్నారు.

'ఉడత' కారణం : ఎస్పీడీసీఎల్‌ సీఎండీ

కాగా.. ఈ ఘ‌ట‌న‌కు ఉడ‌త కార‌ణ‌మ‌ని ఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాథరావు తెలిపారు. విద్యుత్‌ తీగ నుంచి స్థంబంపై ఉన్న ఇనుప క్లాంప్‌ మీదకు ఉడత దూకిందన్నారు. ఉడత దూకిన సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌, ఎర్త్‌ కావడంతో తీగలు తెగి అదే సమయంలో ఆటోపై హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు పడ్డాయని వివరించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు సంస్థ తరుఫున రూ. 5లక్షలు, గాయపడ్డ వారికి రూ. 2లక్షల అందిస్తామ‌ని తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని సీఎండీ అనంతపురం సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ను ఆదేశించారు.

అవ‌న్నీ జ‌గ‌న్ నాట‌క రెడ్డి పాల‌న‌లోనే జ‌రుగుతాయి : లోకేశ్‌

ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ఘటన విషయంలో ఉడుత పేరు చెప్పి, ప్రభుత్వం తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుండటంపై లోకేష్ మండి పడ్డారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు.'తేనెటీగల వల్ల రథం తగలబడటం,ఎలుకలు మందు తాగడం,కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం,ఉడత వల్ల హై టెన్షన్ వైర్ తెగడం వంటివన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయి.ఇంకా నయం!కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పలేదు. ఐదుగురు నిరుపేదలు సజీవ దహనమైతే, కనీస విచారణ జరపకుండానే అధికారులతో కట్టుకథల కహానీలు చెప్పించడం వైసీపీ సర్కారుకి అలవాటైపోయిందని' లోకేశ్ దుయ్య‌బ‌ట్టారు.


Next Story