పలాసకు వెలుతున్న లోకేశ్‌ను అడ్డుకున్న పోలీసులు
TDP Leader Lokesh was stopped by police from going to Palasa.తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను
By తోట వంశీ కుమార్ Published on 21 Aug 2022 11:15 AM ISTతెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పలాసకు వెలుతున్న లోకేశ్‌ను శ్రీకాకుళం సమీపంలోని హైవేపై అడ్డుకున్నారు. దీనిని తెలుగు దేశం శ్రేణులు తప్పుపట్టాయి. కొత్త రోడ్డు కూడలి వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. లోకేశ్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. లోకేశ్ పాటు చినరాజప్ప తదితరులను అదుపులోకి తీసుకుని ఎచ్చెర్ల సమీపంలోని జేఆర్‌పురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
శ్రీకాకుళం జిల్లా కొత్తరోడ్ జంక్షన్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని అడ్డుకున్న పోలీసులు. రోడ్డుమీద బైఠాయించిన లోకేష్ గారు pic.twitter.com/Daf9XskXbi
— Telugu Desam Party (@JaiTDP) August 21, 2022
పలాస పరిధిలో భూకబ్జాలు, ఆక్రమణల అంశంలో గత కొద్ది రోజులుగా తెలుగుదేశం, వైసీపీ లు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం రాత్రివేళ ఆక్రమణల పేరుతో టీడీపీ నేతలతో పాటు ఇతరుల ఇళ్లను కూల్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. గురువారం రాత్రి చెరువులో ఆక్రమించి నిర్మించారంటూ పలాస 27వ వార్డు కౌన్సిలర్, టీడీపీకి చెందిన సూర్యనారాయణ ఇంటిని కూలగొట్టేందుకు అధికారులు యత్నించగా టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రికత్త పెరిగింది.
40 ఏళ్లుగా నివాసం ఉంటున్నవారి ఇళ్లను కూలుస్తామనడంపై భగ్గుమంటున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని నిలదీస్తున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజును టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి సీదిరి అప్పల్రాజుపై ఎమ్మెల్యే బెందళ అశోక్ కామెంట్‌తో పరిస్థితి విషమించకుండా పోలీసులు అప్రమత్తం అయ్యారు. నేతలు పలాసకు వెళ్లకుండా జిల్లావ్యాప్తంగా బలగాలను మోహరించారు. ప్రధాన రహదారులపై తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు కూన రవిని హౌస్ అరెస్టు చేశారు.
ఈ పరిణామాల మధ్య తమ పార్టీ కౌన్సిలర్ సూర్యనారాయణను పరామర్శించేందుకు నారా లోకేశ్ పలాస పర్యటనకు బయలు దేరగా.. శ్రీకాకుళం హైవేపై పోలీసులు అడ్డుకున్నారు.