టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు
స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ పరిశీలనకు వెళ్తున్న టీడీపీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 26 Sep 2023 7:23 AM GMTటీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారు. అంతేకాదు.. చంద్రబాబు కుటుంబం కూడా సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందంటూ మండిపడుతున్నారు. మరోవైపు అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులంతా వాకౌట్ చేసి బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
తాజాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ పరిశీలనకు వెళ్తున్న టీడీపీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను పరిశీలించేందుకు అనుమతి లేదంటూ ముందుగా ధూళిపాళ్లను అడ్డుకున్నారు. ఆయన అక్కడి వెళ్లితీరతానంటూ చెప్పారు. దాంతో.. ముందస్తుగా పోలీసులు ధూళిపాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పోలీసులు ఆయన్ని స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. దాంతో.. టీడీపీ శ్రేణులు పోలీసుల వాహనాలను అడ్డుకున్నారు. ఆ తర్వాత టీడీపీ శ్రేణులను అడ్డుతొలగించే ప్రయత్నంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. చివరకు పోలీసులు కార్యకర్తలను అందరినీ పక్కకు తప్పించి.. ధూళిపాళ్లతో పాటు మరికొందరు నాయకులను అరెస్ట్ చేసి పొన్నూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అయితే.. ధూళిపాళ్లను పొన్నూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారనే విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కాగా.. అంతకుముందు పొన్నురు మండలం చింతలపూడిలో టీడపీ కార్యకర్తల సమావేశంలో ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్షే అని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం ద్వారా ఎందరికో మంచి జరిగిందని చెప్పారు. లక్షల మంది విద్యార్థులు శిక్షణ పొందినా వైసీపీ ప్రభుత్వం కళ్లుండి చూడలేకపోతుందని అన్నారు. అధికారులపై మంత్రులు ఒత్తిడి తీసుకొచ్చి మరీ చంద్రబాబుని కేసులో ఇరికించారని.. లోకేశ్‌ను కూడా ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు.