ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను సీఎం జగన్ వేధిస్తున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఏపీ పోలీసులు అత్యుత్సాహాన్ని తగ్గించుకోవాలని డిమాండ్ చేశారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసుల చిట్టాను తయారు చేస్తున్నామని చెప్పారు. సీఎం జగన్.. అక్రమ కేసులతో ఎంత మందిని జైలుకు పంపారో లెక్కలేదని అచ్చెన్న ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఇబ్బంది పడుతున్న కార్యకర్తలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కొంత మంది పోలీసులు వైసీపీతో కుమ్మక్కై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
సీఎం జగన్ పోలీసు వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు అర్ధరాత్రి అరెస్టులు, థర్డ్ డిగ్రీలతో కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తల కన్నీళ్లకు కారణమైన పోలీసులు, వైసీపీ నాయకులను వదిలే ప్రసక్తి లేదని అచ్చెన్న హెచ్చరించారు. తొడలు కొట్టడం.మీసాలు తిప్పడం పోలీసులు డ్యూటీలో భాగం అనుకుంటున్నారా ? లేక ఫ్యాషన్ అనుకుంటున్నారా? అని నిలదీశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మొదటి రోజు నుంచే చర్యలకు ఉపక్రమిస్తామని వెల్లడించారు.