నవంబర్ 1న టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణ: పవన్, లోకేశ్
నవంబర్ 1న జనసేన-టీడీపీ ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని లోకేశ్ తెలిపారు.
By Srikanth Gundamalla Published on 23 Oct 2023 3:15 PM GMTనవంబర్ 1న టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణ: పవన్, లోకేశ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ.. ఆ పార్టీ నేతలు ఇతర అన్ని పార్టీల నేతలను ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని అన్నారు పవన్ కళ్యాణ్. టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ తర్వాత లోకేశ్‌తో కలిసి పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
అయితే.. వచ్చే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తామని.. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వమని పవన్ కళ్యాణ్ చెప్పారు. జనసేన పార్టీకి రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనుభవం ఉన్న నాయకుడు ఉండాలనే 2014లో టీడీపీకి మద్దతు తెలిపామన్నారు మద్యనిషేధం చేస్తామని చెప్పిన సీఎం జగన్ పట్టించుకోలేదని.. ఇప్పుడు రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఏపీకి పట్టిన తెగులు వైసీపీ అని.. దాన్ని వదిలించుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అయితే.. ఈ తెగులుని వదిలించుకోవాలని టీడీపీ-జనసేన అనే వ్యాక్సిన అవసరమని చెప్పారు. చంద్రబాబుపై రాజకీయ కక్షతోనే జైల్లో పెట్టించారనీ.. సాంకేతిక అంశాలతో బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారంటూ పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు.
అయితే.. చంద్రబాబు మద్దతు తెలిపేందుకు రాజమహేంద్రవరంలో సమావేశం అయ్యామని పవన్ తెలిపారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే కలిశామని పేర్కొన్నారు. ఉమ్మడి మ్యానిఫెస్టో ఎలా ఉండాలనేదానిపై చర్చించామన్నారు. త్వరలో ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
విజయదశమి రోజు టీడీపీ-జనసేన సమావేశం కావడం రాష్ట్రానికి మేలు చేస్తుందని నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. రెండు పార్టీలు కలిసి వెళ్లాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వైసీపీ పాలనలో ఏ వర్గ ప్రజలూ సంతోషంగా లేరని.. బీసీలకు రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని నారా లోకేశ్ చెప్పారు. ఉద్యోగాలు లేక యువత వలస పోతున్నారని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనసేన-టీడీపీ సమావేశం జరిగిందని నారా లోకేశ్ వెల్లడించారు. అయితే.. నవంబర్ 1వ తేదీన ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఆ తర్వాత ఇంటింటికీ వెళ్లి ప్రచారం మొదలుపెడతామని లోకేశ్ చెప్పారు. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని లోకేశ్ దీమా వ్యక్తం చేశారు.