టీడీపీ డిజిటల్ మహానాడు ప్రారంభం.. చంద్రబాబు ఏం మాట్లాడారంటే..

TDP Digital Mahanadu. తెలుగుదేశం పార్టీ డిజిటల్‌ మహానాడును ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోంది.

By Medi Samrat  Published on  27 May 2021 8:37 AM GMT
TDP digital mahanadu

తెలుగుదేశం పార్టీ డిజిటల్‌ మహానాడును ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోంది. మా తెలుగుతల్లి గీతాలాపనతో మహానాడు కార్యక్రమం మొదలైంది. రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. గత మహానాడు నుంచి ఈ మహానాడు వరకు అసువులు బాసిన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలకు మహానాడు సంతాపం ప్రకటించింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి మహానాడులో ఆ ఏడాదిలో మరణించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంతాపం తెలియజేయడం ఆనవాయితీగా వస్తోందని.. పార్టీకి వారు చేసిన సేవలు, అందించిన కృషిని ఎప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు.

తెలుగుదేశం రాకతో నూతన చరిత్ర మొదలైందన్నారు. మే 28 యుగపురుషుడు ఎన్టీఆర్ పుట్టినరోజని, ఎన్టీఆర్‌ తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచారని అన్నారు. సమస్యలపై ప్రజా చైతన్యం తీసుకొచ్చేలా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం సరైన రీతిలో ప్రజల్ని ఆదుకునే చర్యలు తీసుకోలేదని చంద్రబాబు విమర్శించారు. ఆక్సిజన్ లేక, మందులు కొనలేక ఎంతోమంది ఆర్థికంగా చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో చనిపోయిన వారి సంఖ్యను దాచిపెట్టి అవాస్తవాలు చెప్పారన్నారు. మానవ హక్కుల సంఘం విచారణ చేపడితే 23 మందికి పరిహారం ఇస్తామని లెక్క మార్చారన్నారు. ఆనందయ్య వైద్యంపైనా నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. న్యాయస్థానాల్ని కూడా బెదిరించే పరిస్థితికి వస్తే ప్రజా స్వామ్యం ఎటుపోతోందో అర్థం చేసుకోవాలన్నారు. అచ్చెన్నాయుడుతో మొదలు పెట్టిన అక్రమ కేసులు బీసీ జనార్థన్ రెడ్డి వరకూ కొనసాగించారని.. రఘురామ కృష్ణం రాజుపై తప్పుడు కేసులు పెట్టి పోలీసు కస్టడీలో హింసించారన్నారు.

కొవిడ్ కట్టడిలో తీవ్ర వైఫల్యాలు- తలకిందులైన కుటుంబ ఆదాయం అంశంపై టీడీపీ మహానాడులో తొలి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, జయనాగేశ్వర్ రెడ్డి, బాలవీరాంజనేయ స్వామి బలపరిచారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కరోనాతో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి సహజీవనం ఎలా చేయాలో ముఖ్యమంత్రి చెప్పగలరా అని ప్రశ్నించారు. కనీసం మాస్క్ కూడా పెట్టుకోని ముఖ్యమంత్రి ప్రజలకు ఎలాంటి సందేశమిస్తారని నిలదీశారు. వ్యాక్సిన్ వృధా చేసిన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉండటం దురదృష్టకరమన్నారు. మన రాష్ట్ర సమస్యలు పట్టించుకోకుండా కేంద్రాన్ని ఏమీ అడగని జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని కూడా ప్రధానిని అడగొద్దని చెప్పారని మండిపడ్డారు. నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ కట్టడి చేయడంలో జగన్ రెడ్డి విస్మరించారని.. రెండో వేవ్ 20 రెట్లు ప్రమాదకరంగా ఉన్నా ప్రభుత్వం స్పందించలేదన్నారు. బెడ్లు, మందులు, ఆక్సిజన్ సరఫరాపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని అన్నారు.


Next Story