చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ : చంద్రబాబు
TDP Chief Chandrababu Naidu speech in Mahanadu.చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు
By తోట వంశీ కుమార్ Published on 27 May 2022 7:32 AM GMTచరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒంగోలులో జరుగుతున్న మహానాడు లో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహానాడు తెలుగు జాతికి పండుగ అని అన్నారు. చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుందని, పసుపు రంగు చూస్తే చైతన్యం వస్తుందన్నారు. ఈ క్రమంలో వైసీపీ పాలన పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఒక ఉన్మాది పాలన ఏపీకి శాపంగా పరిణమించిందని, పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచక పాలనను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కబ్జాలు, దోపిడీలు పెరిగిపోయాయని దుయ్యబట్టారు. చేతకాని దద్దమ్మ పాలన వల్ల ఏపీ పరువు మొత్తం పోయిందని విమర్శించారు. గత 40 ఏళ్లలో టీడీపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఒక ఎత్తయితే.. ఈ మూడేళ్లలో వచ్చిన ఇబ్బందులు ఒక ఎత్తు అని అన్నారు. తమ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెట్టాలనుకుంటే అంతగా రెచ్చిపోతారన్నారు.
దోచుకోవడం తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, ప్రతి దాంట్లో బాదుతున్నారన్నారు. సరఫరా చేయని కరెంట్ పై కూడా బాదుడే బాదుడని అన్నారు. చెత్తపై, డ్రైనేజీపై, పెట్రోల్ పై ఇలా ప్రతి దానిపై జనాలను బాదుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యావసరాలు కొనలేని పరిస్థితి ఉందన్నారు. పెట్రోల్ ధరలు కేంద్రం తగ్గించినా వైసీపీ ప్రభుత్వం తగ్గించడం లేదన్నారు.
ఇక రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని చంద్రబాబు తెలిపారు. వైసీపీ నేతలు కరుడుగట్టిన నేరస్తులన్నారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదన్నారు. అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డీ పెట్టారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని చంద్రబాబు అన్నారు.