కుప్పంలో చంద్రబాబు క్యాంపెయిన్..లక్ష మెజార్టీ లక్ష్యం
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు క్యాంపెయిన్ ప్రారంభించారు. ఎన్నికల్లో టీడీపీకి లక్ష మెజారిటీ లక్ష్యంగా
By Srikanth Gundamalla Published on 15 Jun 2023 4:20 PM GMTకుప్పంలో చంద్రబాబు క్యాంపెయిన్..లక్ష మెజార్టీ లక్ష్యం
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు క్యాంపెయిన్ ప్రారంభించారు. ఎన్నికల్లో టీడీపీకి లక్ష మెజారిటీ లక్ష్యంగా ఈ క్యాంపెయిన్ చేపట్టారు చంద్రబాబు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న చంద్రబాబు కుప్పం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కుప్పం నియెజకవర్గాన్ని టీడీపీకి ముందు... ఆ తర్వాతగా చూడాలని పేర్కొన్నారు.
అయితే.. నేటి యువతరానికి గతంలో కుప్పం ఎలా ఉండేదో తెలియదన్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఉన్న యువత తాను అభివృద్ధి చేసిన కుప్పాన్ని చూస్తున్నారని చెప్పారు. నాడు అత్యంత వెనుకబడి ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసి.. గెలిచానన్నారు. ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి పనులు చేశానని వెల్లడించారు. చంద్రశేఖర్ అనే వ్యక్తి రూంలో ఉండి కుప్పం ఎమ్మెల్యేగా పోటీ చేశానని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. ఇక అప్పటి నుంచి తన గెలుపుని ప్రజల గెలుపుగా భావించారని.. అందుకు తగ్గట్లుగానే అభివృద్ధి పనులు చేస్తూ వచ్చానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పట్టుదలే తనని ఇంత వరకు తీసుకొచ్చిందన్నారు. కుప్పంలో కాలేజీలు, స్కూళ్లు కట్టించానని చెప్పారు. తాను ఇప్పటి వరకు ఎంతో అభివృద్ధి చేసుకుంటూ వస్తే.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అడ్డుకుంటోందని మండిపడ్డారు చంద్రబాబు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చంద్రబాబు అన్నారు. దీనికి ఉదాహరణ విశాఖలో ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయడమే అని పేర్కొన్నారు. ఎంపీ కుటుంబానికే రక్షణ లేకపోతే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు చంద్రబాబు. సొంత బాబాయిని చంపి జగన్ సీబీఐని మ్యానేజ్ చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ మేనిఫెస్టో పథకాలు చూసి వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. మేనిఫెస్టోలో ఉన్న పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని చంద్రబాబు టీడీపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 175కి 175 సీట్లు టీడీపీ అభ్యర్థులే గెలవాలన్నారు.