గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్లు: చంద్రబాబు

ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  9 Dec 2023 3:00 PM IST
tdp, chandrababu, comments,  mla tickets,

గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్లు: చంద్రబాబు

ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు టీడీపీ అవసరం ఎంతో ఉందని చెప్పారు. అలాగే ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నవారికే పార్టీ తరఫున టికెట్లు కేటాయిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

అంతర్గతంగా చేయించే సర్వేల్లో నాయకుల పనితీరు బాగాలేకపోతే ఉపేక్షించేది లేదని చంద్రబాబు ఆ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ప్రత్యామ్నాయం చూపించి పక్కన పెడతాం తప్ప.. పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెట్టనని తేల్చి చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు అన్నారు. ఓట్ల అవకతవకల విషయాన్ని పార్టీ ఇంచార్జ్‌లు బాధ్యతగా తీసుకోవాలని.. పార్టీ అధిష్టానం చూసుకుంటుందిలే అన్న అలసత్వం వద్దని చంద్రబాబు నాయుడు సూచించారు.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అలాగే ప్రతి కార్యక్రమంలో టీడీపీ-జనసేన నేతలు కలిసి పనిచేయాలని చెప్పారు. కలిసి వేదికను పంచుకోవాలని జనసైనికులను కూడా చంద్రబాబు కోరారు. క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం ద్వారా జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపవచ్చని అన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడాలని.. ప్రభుత్వాన్ని, స్థానిక నాయకులను ప్రశ్నించాలని దిశానిర్దేశం చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు కొట్టుకుపోయిన అంశాన్ని పార్టీ నేతలు తీసుకెళ్లారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే గేటు కొట్టుకుపోయిందని పార్టీ నేతలు ఆరోపించారు. తాము ఉదయమే సంఘటనాస్థలానికి వెళ్లామని.. పరిశీలన చేశామని తెలుగు తమ్ముళ్లు చంద్రబాబుకు వివరించారు.

Next Story