తొలి జాబితాలో సీట్లు దక్కించుకున్న అభ్యర్థులకు చంద్రబాబు హెచ్చరిక
టీడీపీ, జనసేన ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 25 Feb 2024 10:34 AM GMTతొలి జాబితాలో సీట్లు దక్కించుకున్న అభ్యర్థులకు చంద్రబాబు హెచ్చరిక
శనివారం టీడీపీ, జనసేన ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ 24 స్థానాలకు గాను 5 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే.. తాజాగా చంద్రబాబు టీడీపీ అభ్యర్థులకు ఒక హెచ్చరిక చేశారు. ఆయా నియోజకవర్గాల్లో సీటు సంపాదించుకున్న అభ్యర్థుల తీరు సరిగ్గా లేకపోతే మార్చేందుకు ఏమాత్రం వెనక్కి పోమని వార్నింగ్ ఇచ్చారు. ప్రతి వారం అభ్యర్థుల పని తీరుని పర్యవేక్షిస్తానని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే వరకు వారం రోజులకు ఓసారి సర్వే చేయిస్తాననీ.. తేడా వస్తే వేటు తప్పదని సూచించారు చంద్రబాబు.
టికెట్ వచ్చింది కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దని టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు చెప్పారు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకమన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ప్రజల్లో విస్తృతంగా పర్యటించాలని చెప్పారు. అలాగే జనసేన కేడర్‌తోనూ సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసమే టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నాయని మరోసారి చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు, అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎంపిక జరిగిందని చెప్పారు. గతంలో కూడా ఎప్పుడూ ఇంత తొందరగా అభ్యర్థుల ప్రకటన జరగలేదని.. అందుకే జాగ్రత్తగా పనిచేసుకోవాలని చంద్రబాబు సూచించారు.
రాష్ట్రంలో 1.3 కోట్ల మంది అభిప్రాయాలను తీసుకుని, సర్వేలను పరిశీలించి సుదీర్ఘ కసరత్తుల తర్వాతే అభ్యర్థుల ఎంపిక జరిగిందని చంద్రబాబు చెప్పారు. మనం ఒక్క సీటు కూడా ఓడిపోవడానికి వీలులేదని అన్నారు. ఈసారి జరగబోయే ఎన్నికల రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని అన్నారు. ఎక్కడా చిన్న తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని టీడీపీ కేడర్‌తో చెప్పారు. జగన్ పాలన అహకారంతో కొనసాగుతోందనీ.. రాష్ట్ర ప్రజలు వైసీపీ సర్కార్‌ను తరిమి కొట్టేందుకు సిద్ధం గా ఉన్నట్లు చెప్పారు. జగన్ ఎన్నికలకు సిద్ధంగా లేడని ఎద్దేవా చేశారు. సభలు, సమావేశాలు పెడుతున్నారు కానీ అభ్యర్తులను ప్రకటించట్లేదన్నారు. జగన్ దౌర్జన్యంగా, అక్రమాలతో గెలవాలని చూస్తాడని అప్రమత్తంగా ఉండాలి చంద్రబాబు చెప్పారు.