తుపాను బాధితులకు ఆహారం, తాగునీరు అందించలేరా?: చంద్రబాబు
ఏపీలో మిచౌంగ్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 5 Dec 2023 12:00 PM GMTతుపాను బాధితులకు ఆహారం, తాగునీరు అందించలేరా?: చంద్రబాబు
ఏపీలో మిచౌంగ్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల రహదారులు పూర్తిగా జలమయం అయ్యాయి. దాంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తుపాను ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. తుపాను బాధితుల కనీస అవసరాలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాను బాధిత ప్రజలకు తక్షణ అవసరం కింద ఆహారం, నీళ్లు, షెల్టర్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యిందంటూ విమర్శించారు.
ఈ మేరకు తుపాను ప్రభావిత గ్రామాలకు చెందిన పలువురు ప్రజలతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సాయంపై చంద్రబాబు ఆరా తీశారు. ఈ మేరకు వారు చంద్రబాబుతో పలు విషయాలను చెప్పారు. తమకు కనీసం భోజనం కూడా అందడం లేదన్నారు. ప్రభుత్వం నుంచి స్పదంన సరిగ్గా లేదని వెల్లడించారు. తుపాను ప్రభావంపై దాదాపు 12వేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై నాయకులతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో నాయకుల ద్వారా పలు గ్రామాల ప్రజలతో మాట్లాడి..వారి బాగోగులు తెలుసుకున్నారు.
ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురు చూడకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు తుపాను బాధిత ప్రజలకు అండగా ఉండాలని చంద్రబాబు సూచించారు. వెంటనే భోజనం, తాగునీరు అందేలా చూడాలని చెప్పారు. అధికారం ఉన్నా లేకున్నా టీడీపీ ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తుందని ఈ సందర్భంగా చెప్పారు చంద్రబాబు. కష్ట సమయంలో టీడీపీ శ్రేణులంతా ప్రజలకు అండగా నిలబడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎవరికి వీలైనంత సాయం వారు చేయాలన్నారు. వర్షాలపై ప్రజలను అప్రమత్తం చేయడంలో అధికార యంత్రాంగం, ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు అన్నారు. గతంలో టీడీపీ పాలన సమయంలో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు సరైన పద్ధతిలో ఎదుర్కొన్నామని చెప్పారు. అలాగే తుపాను బాధితులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా ప్రతి ఒక్కరు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.