వాలంటీర్లకు తీపికబురు చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఉగాది వేడుకలను నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on  9 April 2024 10:15 AM GMT
tdp, chandrababu, comments, ugadi, andhra pradesh government ,

 వాలంటీర్లకు తీపికబురు చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు 

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొన్నారు. తెలుగు ప్రజలకు ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారు గొప్పగా నిర్వహించుకునే పండుగ ఉగాది అని చెప్పారు. కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా చంద్రబాబు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.

ఉగాది సందర్భంగానే చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లకు తీపికబురు చెప్పారు. తాము అధికారంలోకి రాగనే ఇప్పటి వరకు వాలంటీర్లు తీసుకుంటున్న గౌరవ వేతనాన్ని పెంచుతామని అన్నారు. రూ.5వేలు కాదు.. ఏకంగా రూ.10వేల గౌరవ వేతనం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక వాలంటీర్ల వ్యవస్థను తాము తీసేయబోము అనీ.. కొనసాగిస్తామని ముందే చెప్పినట్లు గుర్తు చేశారు. వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే అండగా ఉంటామని ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు.

ఉగాది సందర్భంగా కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలని చంద్రబాబు అన్నారు. ఈ ఏడాదిలో సాధికారత రావాలని ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో ధరలు తగ్గాలనీ.. అలాగే సంక్షేమం ఉండాలన్నారు. ఉగాది పచ్చడిలో తీపి, వగరు, చేదు.. ఇలా అన్ని రుచులు ఉంటాయన్నారు చంద్రబాబు. కానీ.. రాష్ట్రంలో మాత్రం కారం, చేదు రుచులే ఉన్నాయన్నారు. ఈ ఐదేళ్ల నుంచి ఏపీలో బకాసుడిని మించిన పాలన సాగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. తెలుగు జాతికి మళ్లీ పునర్‌వైభవం తీసుకొచ్చేందుకు తాము కృషి చేస్తామనీ.. ప్రజలు కూడా తమతో కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలు గెలవాలనీ.. రాష్ట్రం నిలబడాలని.. ఇదే తమ సంకల్పమని చెప్పారు.


Next Story