జగన్ నెత్తిన రూపాయి పెట్టి వేలం వేస్తే ఎవరూ కొనరు: చంద్రబాబు

ఆత్మకూరులో ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.

By Srikanth Gundamalla  Published on  27 April 2024 2:00 PM GMT
tdp, chandrababu, comments,  ycp, cm jagan,

జగన్ నెత్తిన రూపాయి పెట్టి వేలం వేస్తే ఎవరూ కొనరు: చంద్రబాబు 

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నలభై ఏళ్లలో తనపై కేసు పెట్టే సాహసం ఎవరూ చేయలేదనీ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రౌడీయిజం కనిపిస్తోందని అన్నారు. ఇదేం రాజకీయాలో అర్థం కావడం లేదని చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ మాట్లాడితే మేం శత్రువులు అని అంటున్నారని గుర్తు చేశారు. అస్సలు తమతో జగన్‌కు శత్రుత్వం ఎందుకో అర్థం కావట్లేదన్నారు.

గ్రామాల్లో ఎవరైనా టీడీపీ వారు గట్టిగా మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీస్తే చాలు వారిని వేధిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. పెన్షన్ కట్‌.. రేషన్‌ కట్‌.. ఇంకా భూములు కూడా లాగేసుకుంటామంటూ భయపెడుతున్నారని చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ 14 లక్షల కోట్ల అప్పు చేశారని అన్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి గోదావరిలో కలిపేశారని మండిపడ్డారు. వారంలోగా సీపీఎస్ రద్దు చేస్తామనీ చెప్పి నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఏపీలో ప్రస్తుతం నార్త్‌కొరియాలో పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికల్లో మీ జీవితాలు మార్చే బటన్‌ నొక్కండి అంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

సీఎం జగన్‌ తన మేనిఫెస్టోలో యువతకు ఉద్యోగాల గురించి ఏమీ చెప్పలేకపోయారని చంద్రబాబు అన్నారు. మరోసారి తాము చెబుతున్నామనీ.. టీడీపీ అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతామన్నారు. అలాగే నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చంద్రబాబు చెప్పారు. చెప్పినవన్నీ చేయడమే కాదు.. చరిత్రను తిరగరాస్తామని చంద్రబాబు అన్నారు.

అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాలు కావాలంటే.. యువత సైకిల్‌ ఎక్కాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే జనసేన గాజుగ్లాసు పట్టుకోవాలనీ.. కమలంపువ్వును కూడా ఉంచుకోవాలని కోరారు. అంగన్వాడీలకు, హెంగార్డులకు న్యాయం చేస్తామన్నారు. టీచర్లను ఆదుకుంటామనీ చంద్రబాబు మాటిచ్చారు. తాజాగా వైఎస్సార్‌సీపీ విడుదల చేసిన మేనిఫెస్టో వేస్ట్‌ అన్నారు. టీడీపీ మేనిఫెస్టో సూపర్‌ సిక్స్‌ అదుర్స్‌ అంటూ చెప్పారు. జగన్ నవరత్నాలు నవ మోసాలుగా తయారయ్యాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేశారు.

Next Story