సీనియర్‌ నేతలను లెక్కచేయని అహంకారి జగన్: చంద్రబాబు

తిరుపతి జిల్లా వెంకటగిరిలో టీడీపీ 'రా.. కదలిరా' సభ నిర్వహించింది.

By Srikanth Gundamalla  Published on  19 Jan 2024 9:30 AM GMT
tdp, chandrababu,  ycp, cm jagan ,

 సీనియర్‌ నేతలను లెక్కచేయని అహంకారి జగన్: చంద్రబాబు

తిరుపతి జిల్లా వెంకటగిరిలో టీడీపీ 'రా.. కదలిరా' సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ఏ వర్గ ప్రజలూ సంతోషంగా లేరని అన్నారు చంద్రబాబు. వైసీపీ వచ్చాక వెంకటగిరి తలరాత ఏమైనా మరిందా అని ప్రశ్నించారు. వైసీపీ సర్కార్‌కి కౌంట్‌డౌన్ మొదలైందని చెప్పారు. రాబోయే 82 రోజుల్లో పతనం తప్పదని జోసత్యం చెప్పారు.

చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ శ్రేణులు సీఎం.. సీఎం.. సీఎం అంటూ అరిచారు. దాంతో.. స్పందించిన చంద్రబాబు.. మున్ముందు ఆనందంతో ఇంకా గట్టిగా అరిచే అవకాశాలు ఉంటాయన్నారు. గట్టిగా నినాదాలు చేయొచ్చని.. డ్యాన్స్‌లు చేసే చాన్సులు ఉంటాయని చెప్పారు. అయితే.. ఇప్పుడు మాత్రం వినాల్సిన సమయం అంటూ చెప్పుకొచ్చారు. గతంలో వైసీపీలో ఉన్న ఆనం రామనాయారణెడ్డే జగన్ పాలన బాగోలేదని చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రజల మేలు కోరి మాట్లాడిన ఆనం రామనారాయణరెడ్డిని పార్టీ దూరం పెట్టిందన్నారు. సీనియర్‌ నాయకులను కూడా లెక్కచేయని అహంకారి సీఎం జగన్‌ అని చంద్రబాబు విమర్శించారు.

సీఎం జగన్ తప్పుల మీద తప్పులు చేస్తూ పోతున్నారని చంద్రబాబు అన్నారు. వెయ్యి తప్పులు చేశారనీ.. ఇంకా భరిస్తారా అని ప్రశ్నించారు. జీతం కోసం అడిగితే ఉద్యోగులు జైలుకు వెళ్లే పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. 25 ఏళ్ల క్రితం యువతకు ఐటీ అనే ఆయుధం ఇచ్చానని చెప్పారు. అదే ఇప్పుడు వారికి వజ్రాయుధం అయ్యిందన్నారు. టీడీపీ హయాంలో తిరుపతిని మొబైల్‌ హబ్‌గా తీర్చిదిద్దామని చంద్రబాబు చెప్పారు. ఈసారి ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి.. వైసీపీ సర్కార్‌ను గద్దె దించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Next Story