భారీ ఆధిక్యంలో టీడీపీ.. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం ఆ రోజేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 1:49 PM ISTభారీ ఆధిక్యంలో టీడీపీ.. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం ఆ రోజేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. ఇప్పటికే రెండు స్థానాల్లో విజయం సాధించి 130 స్థానాల్లో టీడీపీ లీడింగ్‌లో ఉంది. ఇక జనసేన కూడా 20 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. బీజేపీ 7 చోట్ల లీడింగ్‌లో కొనసాగుతుంది. అధికార పార్టీ వైసీపీ ప్రజలు షాక్ ఇచ్చారు. దాంతో.. ఆ పార్టీ ప్రస్తుతం కేవలం 14 సీట్లలో లీడింగ్‌లో కొనసాగుతోంది. ఈ క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కన్ఫామ్ అయిపోయింది. కొన్ని సీట్లు అటూ ఇటూ అయినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాత్రం ఖాయం. ఈ క్రమంలోనే సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం ఎప్పుడు చేస్తారనే చర్చ జరుగుతోంది.
వైసీపీ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరి తుది ఫలితాలు వెలువడే వరకు ఎన్ని స్థానాలు దక్కించుకుంటుందనేది చూడాలి. ప్రతిపక్ష హోదాను వైసీపీ దక్కించుకోవాలంటే 18 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పుడు వైసీపీ 14 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
ఈ నెల 9వ తేదీనే సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎంతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. అయితే.. ఎవరెవరు మంత్రులుగా ప్రమాణం చేస్తారనేది మాత్రం ఫలితాలు పూర్తిస్థాయిలో వచ్చాక క్లారిటీ రానుంది. కాగా.. ఫలితాలకు ముందే జగన్ మరోసారి 9న ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ ప్రచారం చేసుకుంది. ఈ క్రమంలోనే అదే రోజున చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తుండటం వైసీపీ ఎదురుదెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.