అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు.. ఈనెల19కి వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు
By అంజి Published on 13 Jun 2023 1:15 PM IST
అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు.. ఈనెల19కి వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఏ.అమానుల్లా నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్ విచారణ చేపట్టింది. ఇక స్వయంగా కోర్టుకు హాజరై సునీతారెడ్డి వాదనలు వినిపించారు. పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో సీబీఐ సేకరించిన సాక్ష్యాలు, అనేక అంశాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తుకు ఎంపీ అవినాష్ రెడ్డి సహకరించడం లేదని, సీబీఐ పలుమార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అవినాష్ రెడ్డి అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు తన తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపించి, ఈ కేసులో సాక్షులను అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నారని సునీతారెడ్డి ఆరోపించారు. ఇతర నిందితులతో కలిసి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు. అవినాష్‌రెడ్డి ఏపీ ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. జూన్ 30 వరకు దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని సునీతారెడ్డి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సునీతారెడ్డి వ్యక్తిగత పంతాలకు పోయి వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుందని వ్యాఖ్యానించింది. కేసు దర్యాప్తు కు అవినాష్ రెడ్డి సహకరిస్తున్నపుడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందని పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల19కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.