సుప్రీంకోర్టులో వైఎస్‌ అవినాష్‌రెడ్డికి ఎదురుదెబ్బ.. సీబీఐ నోటీసులకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్న

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

By అంజి  Published on  23 May 2023 8:08 AM GMT
Supreme Court, anticipatory bail, YS Avinash Reddy, Viveka Murder Case

సుప్రీంకోర్టులో వైఎస్‌ అవినాష్‌రెడ్డికి ఎదురుదెబ్బ.. సీబీఐ నోటీసులకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్న

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈనెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్‌కు వెళ్లాలని అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు సూచించింది. అలాగే అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని జస్టిస్ జేకే మహేశ్వరి, జ.స్టిస్ నరసింహంలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ వాదనలు వినేంత వరకు తనను అరెస్ట్‌ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

అవినాష్‌ని అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించలేమని చెప్పింది. దీంతో సీబీఐ నోటీసులకు ఎందుకు స్పందించడం లేదని, విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని అవినాశ్ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించడంతో ఇప్పుడు సీబీఐ అధికారలు ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా సీబీఐ తరపున న్యాయవాది హాజరుకాలేదు. ఈ నెల 16, 18, 22న సీబీఐ అధికారులు విచారణకు రావాలని వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. అయితే పలు కారణాలను చూపుతూ వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు హాజరుకాలేదు.

Next Story