ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఎన్నికల వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. దీంతో రేపు సుప్రీం కోర్టులో ఏం జరగబోతోందనే ఆసక్తి నెలకొంది. అయితే.. తొలుత ఈ పిటిషన్‌ను జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం విచారిస్తుందని నిర్ణయించినా.. అందులో మార్పు చోటుచేసుకుంది. ఇప్పుడా పిటిషన్ విచారణ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రిషికేశ్ రాయ్ ధర్మాసనానికి బదిలీ అయింది.
మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే కేవియట్ దాఖలు చేసింది. పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ విచారణలో తమ వాదనలూ పరిగణనలోకి తీసుకోవాలని కేవియట్ ద్వారా ఎస్ఈసీ కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
కాగా.. నిన్న ఎస్ఈసీ తొలి విడుత ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి తొలి విడత నామినేషన్లు జరగాల్సి ఉంది. అయితే, నామినేషన్లకు సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లను అధికారులు చేయలేదు. ప్రస్తుతం కోడ్ అమల్లోనే ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలియజేసింది.