ఏలూరులో సుపారీ గ్యాంగ్ హల్ చల్.. వ్యాపారిని కిడ్నాప్ చేసి..
ఏలూరు నగరంలో ఓ సుపారీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసి.. పిస్టళ్లతో బెదిరించి భయభ్రాంతులకు గురిచేసింది.
By అంజి Published on 4 Oct 2023 12:59 PM ISTఏలూరులో సుపారీ గ్యాంగ్ హల్ చల్.. వ్యాపారిని కిడ్నాప్ చేసి..
ఏలూరు నగరంలో ఓ సుపారీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసి.. పిస్టళ్లతో బెదిరించి భయభ్రాంతులకు గురిచేసింది. ఎట్టకేలకు బాధితుడు మంగళవారం రాత్రి పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడకకు చెందిన అన్నే కాంతారావు స్థిరాస్తి వ్యాపారం చేస్తుంటారు. అతనికి సీహెచ్ వినయ్ రెడ్డి పరిచయమయ్యారు. ఈ క్రమంలో వినయ్ రెడ్డి చెప్పగా కాంతారావు తాడేపల్లిగూడేంకు చెందిన దాట్ల బాలవెంకటసత్యనారాయణ అలియాస్ సతీష్ రాజుకు రూ. 50 లక్షలు అప్పుగా ఇచ్చారు. సతీష్ రాజు కోటీశ్వరుడని, అతని బ్యాంకు ఖాతాలో రూ. కోట్లు ఉన్నాయని నమ్మబలక డంతో అప్పు ఇచ్చేందుకు కాంతారావు అంగీకరించారు. 2017 నుంచి 2019 వరకు విడతల వారీగా రూ.50 లక్షలు ఇచ్చారు.
తర్వాత ఏళ్లు గడిచినా సతీష్ రాజు అప్పు చెల్లించక పోవడంతో కాంతా రావు వినయ్ రెడ్డిని అడుగుతూ వచ్చాడు. అనంతరం సతీష్ రాజు, వినయ్ రెడ్డి ఫోన్ తీసేవారు. కాదు. ఈ క్రమంలో గత నెల 19న బెంగళూరు సీబీఐ కోర్టుకు వినయ్ రెడ్డి, సతీష్ రాజు వస్తున్నారని తెలుసుకుని కాంతారావు అక్కడికెళ్లి వారిని నిలదీశారు. సొమ్ము త్వరలో చెల్లిస్తామని గడువు ఇవ్వాలని కాంతారావును బతిమిలాడుకుని వారు వచ్చేశారు. ఆ తర్వాత డబ్బులిస్తామని చెప్పి కాంతారావును విన యెడ్డి, సతీష్ రాజులు గత నెల 27న ఏలూరులోని ఓ హోటల్‌కు రప్పించారు. ఓ గదిలో కాంతారావును కొంతసేపు ఉంచారు. తరువాత వారు బయటకు వెళ్లగానే నలుగురు వ్యక్తులు గదిలోకి వచ్చారు. తాము ఎస్ఎఫ్ఎ తెలంగాణ పోలీసులమని.. అరెస్టు చేస్తామని కాంతారావును బెదిరించారు.
సుపారీ గ్యాంగ్ సభ్యులు కాంతారావును కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. తర్వాత ఆ గదిలోనే రెండు మూడురోజులు ఉంచాక.. ఓ కారులో బలవంతంగా ఎక్కించి తాడేపల్లిగూడెం వైపు తీసుకెళ్లారు. అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం రోడ్డులోకి, ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించారు. గ్యాంగులోని నలుగురిలో ముగ్గురి వద్ద పిస్టళ్లు ఉన్నాయి. ఒకరు కాంతారావు నుదుటిపై పిస్టల్ పెట్టారు. మరో ఇద్దరు గాల్లోకి, నేలపై కాల్పులు జరిపారు. నువ్వు రూ.50 లక్షలు వదిలేసుకోవాలని, బాకీ మర్చిపోతే బతికిపోతావని.. లేదంటే చంపేస్తామని బెదిరించారు. భయభ్రాంతులకు గురైన కాంతారావు అలాగే చేస్తానని అంగీకరించడంతో అతన్ని హోటల్‌కు తీసుకొచ్చి వినయ్ రెడ్డి, సతీష్‌లు అప్పగించారు. మ్యాటర్ సెటిల్ అయ్యిందని.. కాంతారావు అప్పు అడగడని.. మీరు నిర్భయంగా ఉండవ చ్చని చెప్పి ఆ గ్యాంగ్ సభ్యులు వెళ్లిపోయారు.
మ్యాటర్ సెటిల్ చేస్తానని తాడేపల్లిగూడెం నుంచి నిందితులను నగరానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి రప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. హోటల్ గదిలో సుపారీ గ్యాంగ్ సభ్యులు కాంతారావును కొడుతున్న సమయంలో వీడియో తీసి ఓ వ్యక్తికి చూపించేవారు. ఆ కీలక వ్యక్తికే వీడియో చూపించి ఉంటారని భావిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టూటౌన్ సీఐ చంద్రశేఖరరావు గ్యాంగ్ సభ్యులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అలాగే ప్రధాన నిందితులైన సతీష్ రాజు, వినయ్ రెడ్డిల కోసం కూడా గాలిస్తున్నారు. వారు దొరికితే ఆ కీలక వ్యక్తి ఎవరనేది బయటతపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.