తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొల్కికి రాలేదు. హత్య జరిగి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా.. ఎవరు హత్య చేశారు అన్నది ఇంకా తెలియలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటు చేయగా.. వైఎస్ వివేకా కూతురు సునీత అభ్యర్థన మేరకు రాష్ట్ర హైకోర్టు విచారణను సీబీఐకి బదిలీ చేసింది. ప్రస్తుతం సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.
కాగా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కేరళకు చెందిన హక్కుల కార్యకర్త జోమున్ పుతెన్ పురక్కల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్య వెనుక కొందరి హస్తం గురించి తనకు కచ్చితమైన అనుమానాలున్నాయని చెప్పారు. హత్య వెనుక లోతైన కుట్ర ఉందన్నారు. అయితే.. అనుమానితుల గురించి ఇప్పుడే మాట్లాడడం సరికాదని.. మరో రెండు నెలల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు చెబుతానని.. తన వద్ద ఉన్న సాక్ష్యాలను బయట పెడతానని అన్నారు.
కేరళలో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో తీవ్రంగా పోరాడి.. ఆమెపై జరిగిన దారుణానికి సంబంధించి సీబీఐ సాక్ష్యాధారాలు సంపాదించడంలో జోమున్ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా కుమారై సునీత.. జోమున్ పుతెన్ పురక్కల్‌ను కలిశారు. సాక్ష్యాధారాల సేకరణలో దర్యాప్తు సంస్థకు ఎలా తోడ్పడాలన్న విషయమై చర్చించినట్లు తెలిసింది.