భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్‌లో భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త ఆత్మహత్య చేసకున్నాడు.
By Srikanth Gundamalla Published on 6 July 2024 2:15 AM GMTభార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్‌లో భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త ఆత్మహత్య చేసకున్నాడు. మృతుడు పాతగుంతకల్లు పట్టణానికి చెందిన లోహిత్ కుమార్‌గా గుర్తించారు. కాపురానికి రాకుండా భార్య వేధించడంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..పాతగుంతకల్లు పట్టణానికి చెందిన లోహిత్‌కు.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన లక్ష్మీదేవితో వివాహం జరిగింది. అయితే.. భార్య తరచూ పుట్టింటికి వెళ్లి వస్తూ ఉండేది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. పలుమార్లు భార్య పుట్టింటికి వెళ్లే విషయంపై భర్త పంచాయితీ కూడా పెట్టించాడు. ఆస్తి రాసి ఇస్తే కాపురానికి వస్తానని భార్య కండీషన్ పెట్టింది. కోడలి పేరిట 10 సెంట్లు, మనవడి పేరుతో మరో 10 సెంట్ల స్థలం రాసి ఇచ్చామని మృతుడి తండ్రి కిష్టప్ప చెప్పాడు. అయితే.. ఇటీవల మనవడు చనిపోయాడనీ కోడలు పుట్టింటికి వెళ్లిపోయిందని కిష్టప్ప వెల్లడించాడు.
పోలీస్ స్టేషన్‌లో ఇటీవల జరిగిన పంచాయితీలో కాపురానికి వస్తానని చెప్పి.. మళ్లీ రాకుండా భార్య వేధింపులకు గురి చేసింది. తాజాగా లీగల్ నోటీసులు పంపించడంతో.. ఆ బాధను భరించటేక భర్త లోహిత్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వేధింపుల కారణంగానే లోహిత్ చనిపోయాడని మృతుడి తండ్రి, బంధువులు ఆరోపిస్తున్నారు.
లోహిత్ మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా కూడా చేశారు. భార్య వేధింపులే తన కుమారుడి మరణానికి కారణమని ఆరోపించాడు తండ్రి. కోడలిని రప్పించాలంటూ నినాదాలు చేశారు. అలాగే తమ ఆస్తి, డబ్బును వెనక్కి ఇప్పించాలన్నారు. చివరకు పోలీసులు కలుగ జేసుకుని భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.