చేపలు పట్టేందుకు నలుగురు విద్యార్థులు స్వర్ణముఖి నదిలోకి వెళ్లారు. అయితే.. నీటి ప్రవాహాం ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు ఒకర్ని కాపాడగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రేణిగుంట మండలం జి.పాలెం హరిజనవాడకు చెందిన నలుగురు చిన్నారులు ఆదివారం సెలవు కావడంతో చేపలు పట్టేందుకు స్వర్ణముఖి నదిలోకి వెళ్లారు. కొండి కర్రలతో తయారు చేసిన పడవలో వీరు ప్రయాణం ప్రారంభించారు. కొంత దూరం వెళ్లాక.. ప్రవాహం కారణంగా పడవ నీటిలో మునిగిపోయింది. నీటిలో నలుగురు చిన్నారులు కొట్టుకుపోతుండగా.. గమనించిన స్థానికులు ప్రాణాలకు తెగించి లిఖిత్ సాయి అనే చిన్నారిని కాపాడారు. అయితే.. గణేష్(15), యుగంధర్(14), ధోని(16) గల్లంతైయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ చిన్నారుల తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.