శ్రీకాకుళం జిల్లాలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన చారిత్రక వంతెన కూలిపోయింది. ఇచ్ఛాపురం సమీపంలోని బహుదా నదిపై 70 టన్నుల బరువున్న రాళ్ల లోడ్‌తో లారీ వెళ్తుండగా ఉదయం 6 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా వంతెన కూలింది. దీంతో వంతెనపై ఉన్న లారీ అమాంతం నదిలో పడిపోయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వంతెన కూలిన సమయంలో వంతెనపై ఉన్న వాహనాలన్నీ నదిలో పడిపోయాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
వంతెన కుప్పకూలిన ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 1929లో నిర్మించిన ఈ బ్రిడ్జి ఇచ్ఛాపురం పట్టణాన్ని జాతీయ రహదారికి కలిపే ప్రధాన మార్గం కావడంతో ఇది కూలి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా వాహనాల రాకపోకలు బంద్ అయ్యాయి. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వంతెన శిథిలావస్థకు చేరుకోవడంపై స్థానికులు గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.