శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం, ఇద్దరు మృతి
శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 23 March 2024 2:30 PM ISTశ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం, ఇద్దరు మృతి
శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. గ్రామం సమీపంలోకి వచ్చిన ఒక ఎలుగుబంటి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఎలుగుబంటి దాడి చేసి ఇద్దరిని చంపడంతో స్థానిక ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు.
వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తులు అనకాపల్లి చివరలో ఉన్న తోటకు వెళ్లారు. అక్కడ పని చేసుకుంటుండగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. ఓ ఎలుగుబంటి ప్రత్యక్షం అయ్యింది. అంతే.. ఆ ముగ్గురిని చూసిన ఎలుగుబంటి వారిపై దాడికి దిగింది. ఒకరి తర్వాత ఒకరపై దాడి చేసి చంపేసింది. ఎలుగుబంటి దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారు సీహెచ్ లోకనాథం, లైశెట్టి కుమార్‌గా గుర్తించారు పోలీసులు. ఇక ఇదే ఎలుగుబంటి దాడిలో మరో మహిళ తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. ఆమెను ఆస్పత్రికి తరలించామనీ.. చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఆ మహిల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ సంఘటన తెలుసుకున్న వజ్రపుకొత్తూరు మండలమే కాదు.. చుట్టుపక్కాల వారు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎలుగుబంట్లు తరచూ గ్రామాల్లోకి వస్తున్నాయనీ.. ఇలా దాడులు చేసి మనుషులు, పశువులను చంపేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి.. ఇలాంటిది మరో సంఘటన జరగకు ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎలుగుబంట్లను పట్టుకుని జూలకు లేదంటే ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. మరోవైపు ఎలుగుబంటి దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో అనకాపల్లి గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.