Andhra Pradesh: అవినీతి కేసులో దోషిగా తేలిన అధికారి.. 7 ఏళ్ల జైలు శిక్ష, రూ. 2 లక్షల జరిమానా

అనంతపురం జిల్లా పెనుకొండలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ATWO)గా పనిచేసిన గమ్మల నాగభూషణం అవినీతి కేసులో దోషిగా తేలారు.

By -  అంజి
Published on : 1 April 2026 8:29 AM IST

Assistant Tribal Welfare Officer, Anti-Corruption Bureau Trap, Inter-Caste Marriage Incentive, Rigorous Imprisonment, Prevention of Corruption Act, Bribe Red-Handed, Special ACB Court Kurnool

Andhra Pradesh: అవినీతి కేసులో దోషిగా తేలిన అధికారి.. 7 ఏళ్ల జైలు శిక్ష, రూ. 2 లక్షల జరిమానా 

అనంతపురం జిల్లా పెనుకొండలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ATWO)గా పనిచేసిన గమ్మల నాగభూషణం అవినీతి కేసులో దోషిగా తేలారు. కర్నూలులోని ఏసీబీ ప్రత్యేక కోర్టు మంగళవారం ఆయనకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. శిక్షతో పాటు రూ. 2 లక్షల జరిమానా విధించిన కోర్టు, అందులో రూ. 1.9 లక్షలను బాధితుడికి పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. రాయదుర్గానికి చెందిన కొలిమి అజ్మత్ అనే వ్యక్తి 2014లో ఓ గిరిజన యువతిని కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం అందించే కులాంతర వివాహ ప్రోత్సాహకం కోసం ఆయన 2016లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును పరిశీలించి, నిధులను మంజూరు చేసేందుకు అప్పటి ఏటీడబ్ల్యూఓ నాగభూషణం రూ. 5,000 లంచం డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ. 4,000లకు తగ్గించారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని అజ్మత్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

2018 ఏప్రిల్ 27న ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో నిందితుడిని పట్టుకునేందుకు ట్రాప్ వేశారు. అజ్మత్ నుంచి రూ. 4,000 లంచం తీసుకుంటుండగా నాగభూషణాన్ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 2022లో ప్రారంభమైన ఈ కేసు విచారణలో భాగంగా 17 మంది సాక్షులను విచారించిన కోర్టు, మార్చి 31, 2026న తుది తీర్పును వెలువరించింది. అవినీతి నిరోధక చట్టం కింద నిందితుడు దోషిగా తేలడంతో ఈ కఠిన శిక్షను ఖరారు చేసింది.

నిందితుడు నాగభూషణం 1991లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ప్రభుత్వ సర్వీసులో చేరి, 2016లో ఏటీడబ్ల్యూఓగా పదోన్నతి పొందారు. ఆయన మే 31, 2024న పదవీ విరమణ చేసినప్పటికీ, పాత అవినీతి కేసులో ఇప్పుడు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా పౌరులు తమ ఫిర్యాదులను టోల్ ఫ్రీ నంబర్ 1064 కు తెలియజేయాలని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా కోరారు.

Next Story