ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. శ్రీకాకుళంజిల్లా ఆముదాలవలసలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో సీఎం కప్ టోర్నీని గురువారం స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. అనంతరం ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు తాను కూడా ప్లేయర్‌గా మారి గేమ్స్ ఆడారు. ముందుగా క్రికెట్ ఆడారు. ఆ తరువాత కబడ్డీ ఆడారు.
ఓ జట్టు తరుపున కూతకు వెళ్లిన ఆయన ముగ్గురిని ఔట్ చేసి.. ఉత్సాహంతో నాలుగో వ్యక్తిని ఔట్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన ఆటగాళ్లు, వ్యక్తిగత సిబ్బంది స్పీకర్ సీతారాంను పైకి లేపి సపర్యలు చేశారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఆటల్లో ఇలాంటివి అన్ని ఓ భాగం అని.. తిరిగి ఉత్సాహంగా ఆటలో పాల్గొన్నారు.