ఏపీలోని శ్రీశైల మహాక్షేత్రంలో ప్లాస్టిక్ వాడకంపై పూర్తి నిషేధం విధించనున్నారు. ఇందుకు సంబంధించి తగిన సన్నాహాలు చేస్తున్నట్లు దేవస్థానం కార్య నిర్వహణాధికారి ఎస్ లవన్న తెలిపారు. ప్లాస్టిక్ నిషేధం అమలు కోసం దేవస్థానం నిబంధనలు, ఆంక్షలు పాటించేలా సమర్థవంతమైన అధికారులు, సిబ్బందితో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కమిటీలు ప్రతినిత్యం ప్లాస్టిక్ నిషేధం అమలు తీరును తనిఖీలు చేయడానికి తగిన ప్లానింగ్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి స్వామి అమ్మవార్ల దర్శనం కోసం శ్రీశైలం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో మహాక్షేత్ర పరిసరాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. ఇందు కోసం వ్యాపారులు, స్థానికులకు పలు అవగాహనా సదస్సులు కూడా నిర్వహించామాని, అయినా ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన జంక్షన్లలోని హెటళ్లు, టీస్టాళ్ల వద్ద వాటర్ బాటిళ్లు, కిరాణ షాపుల్లో పార్శిల్ కవర్ల వాడకం నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోవాలని శానిటేషన్ విభాగానికి ప్రత్యేక సూచనలు చేశామని చెప్పారు.
శ్రీశైల క్షేత్ర పరిధిలో వర్తక, వ్యాపార సంస్థలు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు తదితర సంస్థల యజమానులకు ప్లాస్టిక్ నిషేధంపై సూచనలు జారీచేస్తామన్నారు. ప్లాస్టిక్ నిషేధ నిబంధనలు అమలయ్యేలా కఠిన చర్యలు తీసుకుంటామని , దేవస్థానం నిర్ణయాలను నిబంధనలను ఉల్లంఘించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.