మానవత్వానికి అండగా తెలుగు రాష్ట్రాలు: 'కోవా బన్' వ్యాపారికి వెల్లువెత్తుతున్న ఆర్థిక సాయం!

తెలంగాణలోని మేడారం జాతరలో ఒక చిన్న వ్యాపారి పట్ల జరిగిన దుశ్చర్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

By -  అంజి
Published on : 16 Feb 2026 10:00 AM IST

Kova Bun Vendor Support, Medaram Jatara Incident, Shaiksha Vali Kurnool, Nara Lokesh Solidarity, Minority Rights Protection Committee, Communal Harmony Telugu States

మానవత్వానికి అండగా తెలుగు రాష్ట్రాలు: 'కోవా బన్' వ్యాపారికి వెల్లువెత్తుతున్న ఆర్థిక సాయం!

తెలంగాణలోని మేడారం జాతరలో ఒక చిన్న వ్యాపారి పట్ల జరిగిన దుశ్చర్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన షేక్ షైక్షా వలీ అనే వ్యాపారి ములుగు జిల్లాలో జరిగిన మేడారం జాతరలో తన 'కోవా బన్' స్వీట్లను అమ్ముకుంటుండగా, కొందరు యూట్యూబర్లు అతనిపై మతపరమైన ఆరోపణలు చేస్తూ వేధించారు. అతను అమ్ముతున్నది 'ఫుడ్ జిహాద్' కాదని నిరూపించుకోవాలంటూ అతడిని బలవంతంగా ఆ స్వీట్లు తినిపించి అవమానించారు.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవగా, పలు సంస్థలు, నాయకులు వలీకి అండగా నిలిచారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ కమిటీ: ఈ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్ శుబ్లీ, వలీని కలిసి రూ. 50,000 ఆర్థిక సాయం అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో మతపరమైన విద్వేషాలకు చోటులేదని వారు స్పష్టం చేశారు. జనసేన పార్టీ తరపున ఎమ్మెల్సీ నాగబాబు వలీని పరామర్శించి, రూ. 25,000 సాయం ప్రకటించారు. ఆహార భద్రత అనేది ప్రభుత్వ సంస్థల బాధ్యత అని, దీనికి మతం రంగు పూయడం తగదని ఆయన పేర్కొన్నారు.

రాజకీయాలకు అతీతంగా ఈ ఘటనను నాయకులు ఖండించారు. "ప్రియమైన సోదరుడు వలీ.. నీకు జరిగిన దానికి నేను చింతిస్తున్నాను. తెలుగు సమాజంలో ఇలాంటి విద్వేషాలకు తావులేదు. త్వరలోనే నిన్ను కలిసి నీ కోవా బన్ రుచి చూస్తాను" అని ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ సంఘీభావం తెలిపారు. మంత్రి కె. అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. ఆకలికి కులం లేదని, ఆత్మగౌరవానికి మతం లేదని, కేవలం సోషల్ మీడియా వ్యూస్ కోసం ఒక సామాన్యుడిని అవమానించడం అమానవీయమని మండిపడ్డారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, మతపరంగా టార్గెట్ చేసిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

సామరస్యానికి ప్రతీక:

ఈ ఘటన వలీ అనే వ్యక్తికి జరిగిన అవమానంగా మాత్రమే కాకుండా, మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యగా అందరూ భావించారు. అయితే, ఆ తర్వాత వలీకి అందిన మద్దతు తెలుగు ప్రజల మధ్య ఉన్న సోదరభావాన్ని చాటిచెప్పింది. కష్టకాలంలో అందరూ కలిసికట్టుగా నిలబడి, విద్వేషం కంటే మానవత్వం గొప్పదని నిరూపించారు.

Next Story