చిత్తూరు జిల్లాలోని ఓ కుటుంబం పాము పేరు వింటేనే వణికిపోతోంది. పాము కనబడితే చాలు ఇంట్లోవాళ్లు వణికిపోతున్నారు. 45 రోజుల వ్యవధిలో ఒకే ఇంటిలోని నలుగురు సభ్యులను పాము ఆరు సార్లు కాటు వేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం డోర్నకంబాల పంచాయతీ మల్లయ్యపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటేష్ అనే వ్యక్తి తన భార్య వెంకటమ్మ, కుమారుడు జగదీష్ తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ అడవికి సమీపంలో ఉన్న కొట్టంలో నివసిస్తున్నాడు. ఇటీవల శనివారం రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న జగదీష్ కాలికి పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు ఆయనను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
వెంకటేష్‌ను ఇంతకు ముందు రెండుసార్లు కాటు వేయగా, అతని తండ్రి, అతని భార్య వెంకటమ్మ, కొడుకు జగదీష్‌లు పాము కాటుకు గురయ్యారు. తాజాగా జగదీష్ రెండోసారి పాము కాటుకు గురయ్యాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాధితులు బస చేసిన ప్రదేశానికి సమీపంలో మూడు వేర్వేరు కుటుంబాలు నివసిస్తున్నాయి. పాము తమను ఏమీ చేయడం లేదని గ్రామస్తులు వెల్లడించారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు వేరే చోటికి వెళ్లడం లేదని వారు వాపోతున్నారు.